Hyderabad CP CV Anand about Assembly sessions : అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. మొత్తం 1200మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని... జిల్లాల నుంచి వచ్చిన పోలీసులకు కూడా ఇప్పటికే బ్రీఫింగ్ ఇచ్చామన్నారు. నేడు మరోసారి కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులతో సమావేశం అవుతామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వాహనాల్లో సాఫీగా అసెంబ్లీకి చేరేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అసెంబ్లీ వద్ద ఆందోళనలు జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌లో 80 మంది మహిళా ఎస్సైలు విధులు నిర్వర్తిస్తున్నారని... ఈనెల 8న మొదటి మహిళా ఎస్‌హెచ్‌వోను నియమిస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మహిళ ఎస్‌హెచ్‌వోలను నియమిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లో మహిళా బంధు వేడుకలు
Women's day celebrations in Hyderabad : పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లో పోలీసులు, భరోసా, షీ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే, 2కే రన్‌లో మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్‌పై ఉన్న లేపాక్షి వరకు 5కే రన్..... పీవీ ఎన్టీఆర్ మార్గ్ వరకు 2కే రన్ ప్రారంభించారు. సమానత్వం కోసం నిర్వహించిన పరుగులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈనెల 8న మొదటి మహిళా ఎస్‌హెచ్‌వోను నియమిస్తున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. షీ టీం పనితీరును మంత్రులు అభినందించారు.
మహిళలకే పెద్దపీట
Mohamood ali Women's day wishes : మహిళా దినోత్సవం సందర్భంగా... మహిళా మూర్తులందరికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ... ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పురుషులకంటే మహిళలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని పోలీస్ భద్రత తెలంగాణలో ఏర్పాటు చేశారన్నారు. అన్నిరంగాల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస అని తెలిపారు. మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో మహిళలకు ఎస్హెచ్ఓ ఇస్తున్నామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దేశంలో నంబర్ వన్ పోలీస్ వ్యవస్థ తెలంగాణ పోలీస్ శాఖ. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. షీ టీమ్‌తో మహిళలకు ఎంతో భద్రత కల్పిస్తున్నాం.
-మహమూద్ అలీ, రాష్ట్ర హోంశాఖ మంత్రి
Sabitha Indra reddy Women's day wishes : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నగర పోలీసులకు అభినందనలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల భద్రత పట్ల చేపట్టిన మానస పుత్రిక షీ టీమ్. షీ టీమ్ దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు భద్రత కల్పిస్తోంది. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని చర్యలు తెలంగాణలో చేపట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మరింత మంది మహిళలు రావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రానున్న రోజుల్లో మహిళా కొత్వాల్ కూడా వస్తారని ఆశిస్తున్నాం.
-సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
జీవితంలో మహిళల పాత్ర ఎంత గొప్పదో చెప్పుకోవడానికి మహిళా దినోత్సవం మంచి అవకాశమని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసు శాఖలో ఎంతో మంది మహిళలు పని చేస్తున్నారని... ఈ మధ్య కాలంలో 80మంది మహిళ ఎస్సైలు చేరారని తెలిపారు. మహిళలల భద్రత కోసం షీ టీమ్ ఎంతో గొప్పగా పనిచేస్తుందన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు భద్రతా ఏర్పాట్లపై కసరత్తు పూర్తి చేశాం. 1,200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. అసెంబ్లీ వద్ద ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్‌లో 80 మంది మహిళా ఎస్సైలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 8న మొదటి మహిళా ఎస్‌హెచ్‌వోను నియమిస్తాం. రానున్న రోజుల్లో మహిళ ఎస్‌హెచ్‌వోలను నియమిస్తాం.
-సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
ఇదీ చదవండి: రక్తపోటు.. మధుమేహ కాటు.. ప్రమాదకరంగా జీవనశైలి వ్యాధులు