piligrims agitation: తెలంగాణ నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ వాసులు రిషికేశ్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారుల తీరు వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అయిందని నిరసనకు దిగారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాధారణంగా చార్‌ధామ్ యాత్రకు బయలుదేరిన భక్తులు రిషికేశ్ వద్ద తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు రిషికేశ్‌లోని బీటీసీ క్యాంపస్‌లో రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ఐనా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి యాత్ర చేపడితే ఇప్పడు అనుమతించడం లేదని వారు వాపోయారు. రిజిస్ట్రేషన్ ప్రకారం వెళ్లాలంటే, అడ్వాన్స్ బుకింగ్ సమాచారాన్ని ముందుగానే తెలియపరచాలని అధికారులపై మండిపడ్డారు.
రిజిస్ట్రేషన్ చేయకుండా ఇక్కడే ఆపడం సరికాదన్నారు. దైవ దర్శనం కోసం వచ్చామని, దర్శనం లేకుండా తిరిగి వెళ్లబోమని స్పష్టం చేశారు. వెనక్కి పంపాలని ప్రయత్నిస్తే చావడానికి సిద్ధమని వారు హెచ్చరించారు. కాగా కొన్ని రోజుల వరకూ ప్రణాళిక ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఈ సారి చార్‌ధామ్ యాత్రలో ఇప్పటివరకూ ప్రతికూల వాతావరణం వల్ల 39 మంది ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో కొందరు మృతిచెందారు. ఆరోగ్య బాగాలేని వారు, వయసు పై బడిన వారు యాత్రకు రావద్దని ఉత్తరాఖండ్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: Bharat Biotech donation: నిత్యాన్నదానానికి భారత్ బయోటెక్ భారీ విరాళం..