కొవిడ్ బాధితులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ అవసరమున్న రోగుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వారికి ప్రాణవాయు పరికరాన్ని బిగించేటప్పుడు ఆక్సిజన్ ఫ్లో మీటర్లు కీలకమవుతాయి. కానీ, వాటి భారీ కొరత ప్రస్తుతం రాష్ట్రాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ఉత్పత్తి సంస్థలు కొన్నే ఉండడం.. ఆక్సిజన్ పరికరాల అవసరాలు అనూహ్యంగా పెరగడంతో ఇంతగా కొరత ఏర్పడినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం టెండరు ద్వారా కొనుగోలుకు ప్రయత్నించినా.. ప్రస్తుత డిమాండ్ దృష్ట్యా ఉత్పత్తి సంస్థలేవీ పాల్గొనడం లేదు. తప్పనిసరై బహిరంగ విపణిలో కొనాల్సి వస్తోంది. గతంలో రూ.450-600కు మించని వీటి ధర.. ఇప్పుడు ఏకంగా రూ.2500 నుంచి రూ.3000 వరకూ పలుకుతోందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఆక్సిజన్ ఫ్లో మీటర్లు లేకపోతే కొవిడ్ బాధితులకు ప్రాణవాయు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అత్యధిక ధరలకు వాటిని కొనక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
ఏమిటీ ఆక్సిజన్ ఫ్లో మీటర్?
- రోగికి ప్రాణవాయువు అందుబాటులో ఉండడం ఎంత ముఖ్యమో.. దాన్ని లోనికి పంపించడానికి అవసరమయ్యే పరికరాలూ అంతే ముఖ్యం.
- రోగికి ఆక్సిజన్ సరఫరాలో ‘ఫ్లో మీటర్’ కీలకంగా వ్యవహరిస్తుంది. సిలిండర్ నుంచి లేదా పైపులైను ద్వారా ఆక్సిజన్‌ను రోగికి అందించేటప్పుడు.. ఎంత మోతాదులో ప్రాణవాయువు వెళ్తుందనేది ఈ పరికరమే సూచిస్తుంది.
- బాధితుడికి నిమిషానికి 5 లీటర్ల ఆక్సిజన్ అవసరమైతే.. మరొకరికి 40 లీటర్లు కావాల్సి ఉంటుంది. ఆ మోతాదు మేరకు ప్రాణవాయువును అందించే అంతర్గత నియంత్రణ వ్యవస్థ ‘ఫ్లో మీటర్’లోనే ఉంటుంది. సరఫరాలో హెచ్చుతగ్గులు లేకుండా సమతుల్యతను కొనసాగిస్తూ, ప్రాణవాయువు వృథా కాకుండా చూసే కీలక పాత్ర దానిదే.
పెచ్చుపెరిగిన అవసరాలు
రెండోదశలో ఒక్కసారిగా కొవిడ్ ఉద్ధృతితో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ విజృంభణను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలోనూ ఆక్సిజన్ పడకల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ప్రభుత్వ వైద్యంలో మార్చి 2020కి ముందు 2,400 వరకూ ఆక్సిజన్ పడకలుండగా.. వీటికి అదనంగా మరో 9300 పడకలను మార్చి 2021 నాటికే కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ వైద్యంలోనే ఆక్సిజన్ పడకలు ఇప్పటికే సుమారు 11700 ఉండగా.. రెండో ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు మరో 3000 పడకలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. ఇప్పటికే 2వేల ఆక్సిజన్ సిలిండర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి సరఫరా చేయగా.. మరో 2వేల సిలిండర్లను త్వరలో కొనుగోలు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ గతేడాది మార్చికి ముందు 4,400 ఆక్సిజన్ పడకలుండగా.. ఇప్పుడవి ఏకంగా 13,500లకు పెరిగాయి. ఇవన్నీ ఐసీయూ వెంటిలేటర్ పడకలకు అదనంగా అందుబాటులో ఉన్నవే. ప్రతి ఆక్సిజన్ పడకకూ రెండు విధాలుగా ప్రాణవాయువును అందిస్తుంటారు. ఒకటి సిలిండర్ రూపంలో.. మరోటి కేంద్రీయ ప్రాణవాయు వ్యవస్థ ద్వారా పైపులైన్ల సాయంతో అందించేది. ఏ విధానంలో ప్రాణవాయువును రోగికి అందించినా.. ఇందులో తప్పకుండా వినియోగించాల్సింది ‘ఫ్లో మీటర్’.
ఎందుకు ఇప్పుడే కొరత?
ఏకబిగిన వరుసగా ఆక్సిజన్ సేవలను ఒక్కో పడకకూ వినియోగిస్తుంటే.. ఫ్లో మీటర్ పనితీరు క్రమేణా సన్నగిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. నిరంతరాయంగా వాడుతుంటే మరీ గరిష్ఠంగా 4-6 నెలలకు మించి పనితీరు సమర్థంగా ఉండదని విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వ వైద్యంలో మరో 3వేల ఆక్సిజన్ పైపులైన్ పడకలు, 2వేల సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటికీ ఫ్లో మీటర్లు అవసరం. అనివార్యంగా వాటిని కొనక తప్పని పరిస్థితి.. దేశంలో ఆక్సిజన్ ఫ్లో మీటర్లను సరఫరా చేసే ఆరు సంస్థలు దిల్లీ, అహ్మదాబాద్, నాగ్‌పుర్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులోనూ అత్యధికంగా ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఒక్క సంస్థకే ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. పరిమిత సంఖ్యలో ఉన్న వాటిని కూడా ప్రస్తుత డిమాండ్ దృష్ట్యా సంస్థలు అత్యధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఇంతకుముందు రూ.600 లోపు గరిష్ఠ ధర ఉండగా... ఇప్పుడు వీటిని నాలుగైదింతలకు పెంచి మరీ ఉత్పత్తి సంస్థలు అమ్ముకుంటున్నాయి. వీటిని టెండరులో కొనుగోలుకు ప్రయత్నించినా.. ఒక్క సంస్థా ముందుకురాక, వేరే దారి లేక ఉత్పత్తి సంస్థలు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించి, అవి అందజేసిన మేరకు కొనాల్సి వస్తోందని వైద్యవర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా ఈ ఆక్సిజన్ ఫ్లో మీటర్లు సరిపోను లేకపోతే.. రోగుల ప్రాణాలతో చెలగాటమాడినట్లే అవుతుంది.
ప్రాణవాయు సరఫరాలో నియంత్రణే కీలకం
రోగికి ప్రాణవాయువును అందించడంలో ఆక్సిజన్ ఫ్లో మీటర్ పాత్ర కీలకం. ఇందులోనూ రకరకాల అవసరాలను తీర్చే వేర్వేరు చిన్న చిన్న పరికరాలతో కలిపి ఒకటిగా వస్తుంది. ఆ పరికరాలు సైతం ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. ఆక్సిజన్‌ను రోగి శ్వాసనాళం లోనికి పంపించడానికి ముందు.. శుద్ధజలంలో ఆ ప్రాణవాయువు తడుస్తుంది. అప్పుడే పొడివాయువులా కాకుండా తడి వాయువు లోనికి వెళ్తుంది.
అలాగే ఆక్సిజన్ ఎంత మోతాదులో పంపించాలనే నియంత్రిక కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆక్సిజన్‌ను కూడా రోగికి ఎంత మేరకు అందించాలనేది రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మారుతుంటుంది. కాబట్టి ప్రాణవాయువు అందుబాటులో ఉండడం ఎంత ముఖ్యమో.. దాన్ని లోనికి పంపించడానికి అవసరమయ్యే పరికరాలూ అంతే ముఖ్యం.-డా।।కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ ఇన్‌ఛార్జి, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి
ఇదీ చూడండి: రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు