Increase registration revenue: స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఏడాది ప్రభుత్వానికి భారీగానే రాబడి వచ్చింది. గతంతో పోల్చితే ఈ ఏడాదే అధిక ఆదాయం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో కరోనా పరిస్థితులతో కొంత ఒడిదొడుకులు నమోదైనా క్రమేపీ ఊపందుకుంది. ఎనిమిది నెలల కాలంలో(నవంబరు నాటికి) రూ.7,006.48 కోట్ల ఆదాయం రాగా డిసెంబరు 6వ తేదీ నాటికి రూ.7,258 కోట్లను దాటింది. ఒక్క నవంబరులో రూ.1,138 కోట్లు వచ్చింది. సగటున నెలకు రూ.875 కోట్లు వస్తున్నట్లు అంచనా. 2018-19లో రిజిస్టేషన్ల శాఖ వద్ద నెలకు సగటున 1.26 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యేవి. 2019-20లో నెలకు 1.38 లక్షలు నమోదయ్యాయి. ఈ ఏడాది నెలకు సగటున 1.5 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి (వచ్చే మార్చి నెలాఖరుకు) రూ.10 వేల కోట్లపైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెరగడంతో..
Increase Immovable property: గతంతో పోల్చితే రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరిగాయి. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంతోపాటు పలు ప్రాజెక్టుల కింద సాగునీటి లభ్యత పెరిగింది. దీని వల్ల వ్యవసాయ భూముల ధరలకు ఊపు వచ్చింది. మండల కేంద్రాలు, పట్టణాలు, నగర శివార్లు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో స్థిరాస్తి రంగానికి రెక్కలొచ్చాయి. సాగు, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరగడం కూడా రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదలకు దోహదం చేసింది.
భూముల ధరల సవరణతో ఆదాయ వృద్ధి...
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏడేళ్ల తరువాత ప్రభుత్వం భూముల ధరలను సవరించింది. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సవరించారు. 2010 వరకు అమల్లో ఉన్న సర్వే నంబరు వారీగా ధరల లెక్కింపు విధానాన్ని ఈ ఏడాది అమల్లోకి తెచ్చారు. స్టాంపు డ్యూటీని 6 నుంచి 7.5 శాతానికి పెంచారు. ఇది కూడా ఆదాయం వృద్ధి కావడానికి ఒక కారణమే. గతేడాది మార్చి ఆఖరు నుంచి నవంబరు వరకు ఆదాయం పూర్తిగా పడిపోయింది. డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు కొంత కోలుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పర్వాలేదనుకుంటున్న తరుణంలో రెండో దశ కరోనా, లాక్‌డౌన్ పరిస్థితులు దెబ్బతీశాయి. ఏప్రిల్‌లో రూ.716.89 కోట్లున్న ఆదాయం.. మే నెలలో రూ.234.50 కోట్లకు పడిపోయింది. ఆ తరువాత జూన్‌లో రూ.674.43 కోట్లు, జులైలో రూ.1201.86 కోట్లు, ఆగస్టులో రూ.922.72 కోట్లుగా నమోదయింది. ఆ తర్వాత భూముల ధరల సవరణతో సెప్టెంబరులో రూ.1090.94 కోట్లకు పెరిగింది. అప్పటి నుంచి అదే ఊపు కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలు రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి.
ఇదీ చదవండి: రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్- మధ్యాహ్నానికి రూ.కోటి జాక్పాట్