Traffic Pending Challan: రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన జరిమానాల రాయితీలకు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. నాలుగో రోజు 15 లక్షల చలానాలను వాహనదారులు చెల్లించారు. తొలి నాలుగు రోజుల్లో 54 లక్షలకు గాను రూ.54 కోట్లు కట్టారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పెండింగ్ ఉన్న వాటిల్లో 95 శాతం ద్విచక్రవాహనాలవే ఉన్నాయని వివరించారు. మార్చి 1 నుంచి పెండింగ్ చలానాలు చెల్లించేందుకు వీలు కల్పించడంతో వాహనదారులు వేగంగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్, ఈ-చలాన్ వైబ్‌సైట్‌లోకి వెళ్లి చలానాలను కట్టేస్తున్నారు.
నిమిషానికి 700 చలాన్లు..
దీంతో ఒక సెకెనుకు గరిష్ఠంగా 45 వేల హిట్లు వచ్చాయని పోలీసులు తెలిపారు. నిమిషానికి 700 చలానాల చెల్లింపులు జరుగుతుండగా... పోలీసులు సర్వర్ సామర్థ్యం పెంచి వెయ్యి చలానాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. దీంతో మార్చి1న 8 లక్షల చలానాలు, మార్చి 2న 15 లక్షల చలానాలు, మార్చి 3న 16 లక్షల చలానాలను వాహనదారులు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 4న 15 లక్షల చలానాలను వాహనదారులు చెల్లించారు.
ఏప్రిల్ 1 నుంచి పాత విధానమే..
‘కరోనా కారణంగా పెండింగ్ చలానాలు చెల్లించే వాహనాదారులకు రాయితీలు కల్పించాం. ఏప్రిల్ 1 నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే జరిమానాలు విధిస్తాం. చలానాలు చెల్లించకపోతే మళ్లీ రాయితీలు ఇస్తారన్న భావనతో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం. ఇకపై డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి దాటాక రెండు గంటల వరకు నిర్వహించనున్నాం. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో తెల్లవారుజామున 4గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. రహదారులపై సురక్షిత ప్రయాణానికి చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు సహకరించాలి’’ అని సంయుక్త కమిషనర్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ తెలిపారు.
ఇదీ చదవండి: