మున్సిపల్ మార్కెట్లు, సముదాయాల్లోని దుకాణాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. దుకాణాల కేటాయింపులో, అద్దె వసూళ్లలో, లీజు పూర్తయిన వాటిని ఖాళీ చేయించి వేలం నిర్వహించడంలో అవినీతి పెచ్చుమీరుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కవుతున్న కొందరు అధికారులు.. దుకాణాలను అత్తెసరు అద్దెలకే వేలంలో కేటాయిస్తున్నారు. లీజు పూర్తయిన మార్కెట్లను, పరాధీనమైన దుకాణాలను స్వాధీనం చేసుకోవట్లేదు. దుర్వినియోగమవుతున్న లీజు స్థలాలను సంరక్షించడంలేదు. వసూలయ్యే అద్దెతో కొందరు జేబులు నింపుకొంటుంటే.. మరికొందరు అద్దెలు వసూలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెరసి ఎస్టేట్స్ విభాగం పరిధిలోని కోట్లాది రూపాయల ఆస్తులను సర్కిళ్లు, జోన్లు, కేంద్ర కార్యాలయం అధికారులు గాలికి వదిలేశారు.సికింద్రాబాద్, ఉప్పల్, కుషాయిగూడ, ఎల్బీనగర్, అబిడ్స్, కోఠి, సీబీఎస్ ఇతరత్ర ప్రాంతాల్లోని మార్కెట్లు, సముదాయాల్లోని 2 వేలకు పైగా దుకాణాలను నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఆదాయానికి గండి కొడుతున్నారిలా..
- జీహెచ్‌ఎంసీ ఇటీవలే రూ.10 కోట్లు వెచ్చించి మొజంజాహి మార్కెట్‌ను ఆధునికీకరించింది. అయినా చిన్నపాటి వర్షానికే శ్లాబు కారుతోంది. ఈ మార్కెట్‌లో 180 దుకాణాలున్నాయి. 80 శాతం దుకాణాల నుంచి అద్దె వసూలవట్లేదు. లీజు పూర్తయిందని, దుకాణాలను ఖాళీ చేయాలని గతంలో ఓ అదనపు కమిషనర్ లీజుదారులకు నోటీసులిస్తే.. పైస్థాయి అధికారులు ఆయనపై బదిలీ వేటు వేశారు.
- హబ్సిగూడలోని 1, 8 నంబరు వీధుల్లో, బీరప్పగడ్డలో బల్దియాకు 27 దుకాణాలు గల మార్కెట్లున్నాయి. వాటికి 25 ఏళ్ల అనంతరం ఇటీవల వేలం నిర్వహించారు. వాటిని అడ్డదారిలో ఓ ప్రజాప్రతినిధి అనుచరులకు అప్పగించేలా సర్కిల్ అధికారులు ప్రకటన రూపొందించారు. మార్కెట్‌లో ఒక్కో దుకాణానికి రూ.70 వేల అద్దె వస్తుంటే.. రూ.4 వేల నుంచి రూ.7 వేల అద్దెకు వేలం ముగించారు.
- ఫిల్మ్‌నగర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని బల్దియా ఎఫ్‌ఎన్‌సీసీకి 30 ఏళ్లకు రూ.5 వేల అద్దెకు లీజుకిచ్చారు. ఒప్పందం ఉల్లంఘిస్తూ అందులో నిర్మాణాలు, కార్యకలాపాలు జరుగుతున్నాయని, అదనపు రుసుము వసూలు చేయాలని ఫిర్యాదులున్నా చర్యలు తీసుకోవట్లేదు.
- సైనిక్‌పురి సముదాయంలోని దుకాణాలకు మూడేళ్ల క్రితం వేలం నిర్వహించి, లబ్ధిదారులకు అప్పగించట్లేదు. స్థానిక నేతల ఫిర్యాదుతో మరోమారు వేలం పాటకు నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం.
- త్వరలో కోఠి, న్యూబోయిగూడ, సీబీఎస్ తదితర ప్రాంతాల్లోని వందలాది దుకాణాలకు బల్దియా వేలంపాట నిర్వహించాల్సి ఉంది.
- మున్సిపల్ మార్కెట్లు 22
- వాటిలోని దుకాణాలు 1400
- మున్సిపల్ సముదాయాలు 19
- వాటిలోని దుకాణాలు 785
- మొత్తం దుకాణాలు 2185
- లీజుకిచ్చిన ఖాళీ స్థలాలు 80
- ఏడాదికి వస్తున్న అద్దె రూ. కోటి..
ఇదీ చూడండి: GHMC Negligence : అప్పుడూ.. ఇప్పుడూ అదే నిర్లక్ష్యం...