How to Apply CM Relief Fund in Telangana: ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు డబ్బుతో ముడిపడిన సమస్య ఏదైనా పెద్దదే! ఇక, అది కుటుంబ సభ్యుల అనారోగ్యానికి సంబంధించినదైతే.. వారి వ్యధకు అంతే ఉండదు. దీర్ఘకాలిక రోగాలు కావొచ్చు, ఊహించకుండా వచ్చి పడే జబ్బులు కావొచ్చు.. ఇంటిని, ఒంటిని గుల్లచేసి పారేస్తాయి. చివరకు అప్పులపాలు కూడా చేస్తాయి. ఇలాంటి వారికోసం తెలుగు రాష్ట్రాల్లో.. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఉన్నప్పటికీ.. కొన్ని జబ్బులను ఈ పథకంలో చేర్చలేదు. దీంతో.. అనివార్యంగా డబ్బు ఖర్చు చేసుకొని వైద్యం పొందాల్సి ఉంటుంది. అప్పులు కుప్పలైనా.. ప్రాణం ముఖ్యం కాబట్టి అందినకాడ తెచ్చి వైద్యం చేయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఆఖరి ఆశాదీపం ఏదైనా ఉందంటే.. అది ముఖ్యమంత్రి సహాయ నిధి. వైద్యం కోసం చేసిన ఖర్చును పరిశీలించి.. ఆ దరఖాస్తుకు అర్హత ఉందని భావిస్తే.. తగిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అది ఎంతైనా.. బాధితులకు ఊరటే. మరి.. సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇస్తారు? ఎలాంటి సమయంలో దీన్ని వాడుకోవాలి..? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటి? : ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలను.. ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. వైద్య చికిత్స కోసం కొంత మేర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాలు, తెల్లకార్డుదారులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. అయితే.. చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు. కొద్దిమందికి తెలిసినా.. అప్లై చేసుకునే విధానం తెలియదు. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హత ప్రమాణాలు:
- ఆరోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజలు దీనికి అర్హులు.
- ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలు కూడా..
- బాధితులు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
అవసరమైన పత్రాలు:
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్ సైజు ఫొటో
- వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం
- రేషన్ కార్డు
- వైద్య బిల్లులు
- బ్యాంకు అకౌంట్
- ఫోన్ నంబరు
- ఈ-మెయిల్ ఐడీ
రైతులకు శుభవార్త! ఈ స్కీమ్‌లో చేరితే నెలకు 3వేల పింఛన్!
CM రిలీఫ్ ఫండ్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేయాలి? :
Application Process For CM Relief Fund in Telangana:
- ముందుగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. అర్హతను తనిఖీ చేయండి.
- ఆ తర్వాత.. పైన చెప్పిన డాక్యుమెంట్లతో మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఏదైనా మీ సేవా కేంద్రానికి వెళ్లండి.
- అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారమ్ తీసుకుని.. అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేయండి.
- ఇప్పుడు అవసరమైన పత్రాలను అప్లికేషన్ ఫారమ్‌కు జత చేసి.. మీ సేవ ప్రతినిధికి ఇవ్వండి.
- అప్లై చేసిన తర్వాత ఫారమ్‌ని భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోండి.
- మీ అర్హతను, జబ్బు తీవ్రతను సీఎం రిలీఫ్ ఫండ్ అధికారులు పరిశీలిస్తారు.
- అర్హతను బట్టి తగినంత డబ్బును విడుదల చేస్తారు.