House Sales Decreased in Hyderabad: హైదరాబాద్ నగరంలో గృహాల క్రయ విక్రయాలు తగ్గాయి. ఈ ప్రభావం రిజిస్ట్రేషన్ల సంఖ్యపై పడి.. ఆ సంఖ్య సైతం పడిపోయింది. ఫిబ్రవరి నెలలో రూ.2,816 కోట్లు విలువైన 5,274 ఇళ్లు అమ్ముడు పోయినట్లు ప్రముఖ స్థిరాస్థి కన్సల్టెన్సీ సంస్థ ఫ్రాంక్ నైట్ వెల్లడించింది. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విలువ చేసే గృహాలు రికార్డు స్థాయిలో 51 శాతం అమ్ముడుపోగా, 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు అత్యధికంగా 68 శాతం సేల్ అయ్యినట్లు తెలిపింది.
రాను రాను హైదరాబాద్ సిటీలో ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గృహ రుణాల వడ్డీ రేట్లు, స్థిరాస్తుల ధరలు విపరీతంగా పెరగడంతో అమ్మకాలు ఆశించినంత స్థాయిలో లేవు. 2021 ఫిబ్రవరితో పోలిస్తే దాదాపు 25 శాతం విక్రయాలు పడిపోయినట్లు నైట్‌ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. 2021 ఫిబ్రవరిలో రూ.2,939 కోట్లు విలువైన 6,877 ఇళ్ల విక్రయాలు జరిగితే.. గతేడాది ఫిబ్రవరిలో రూ.2,816 కోట్ల విలువైన 5,274 గృహ యూనిట్లు అమ్ముడుపోయాయి.
గత నెలలో అమ్ముడుపోయిన గృహాలను విలువ వారీగా చూసినట్లయితే.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య 51 శాతం ఉన్నాయి. రూ.25 లక్షల కంటే తక్కువ విలువైనవి కేవలం 18 శాతం ఉన్నాయి. ఇక రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు.. అంతకంటే ఎక్కువ విలువైనవి 31 శాతంగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
అదే సమయంలో వాటి విస్తీర్ణాలను పరిశీలిస్తే.. 1000 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం కలిగినవి 21 శాతం ఉండగా.. 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినవి రికార్డు స్థాయిలో 68 శాతం ఉన్నాయి. 2 వేల నుంచి 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినవి 9 శాతం, మూడు వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగినవి కేవలం 2 శాతం ఉన్నాయి.
నాలుగు జిల్లాల పరిస్థితి : అత్యధికంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో 43 శాతం ఇళ్లు అమ్ముడుపోయాయి. రంగారెడ్డి జిల్లాలో 39 శాతం, హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 శాతం, సంగారెడ్డి జిల్లా పరిధిలో కేవలం మూడు శాతం ఇళ్లు అమ్ముడుపోయాయి. పెరిగిన ధరలను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 9 శాతం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 5 శాతం పెరిగితే.. రంగారెడ్డి జిల్లాలో 1 శాతం ధరలు తగ్గినట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది.
ఇవీ చదవండి: కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్.. మీరూ ఓ లుక్కేయండి..!
'ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులు బాధాకరం'.. ఆ దేశ ప్రధానితో మోదీ