CM KCR on Schools: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచే మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి.
అటు రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా మూడో రోజు కూడా ముసురు కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా సగటున 8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలోని మాన్‌సూన్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు:
రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు కరుస్తున్నాయని.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల సహాయం కొరకు 040-21111111 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించాలని.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని తలసాని ఆదేశించారు.