Historic judgment of Nampally court: టెలిగ్రాఫ్ ట్రాఫిక్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో నిధుల దుర్వినియోగం చేసి 53 కోట్ల దారి మళ్లింపు కేసులో నాంపల్లిలోని కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవితఖైదు విధించింది. డిపాజిటర్స్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిందితుడికి జీవితఖైదు శిక్ష పడటం ఇదే తొలి సారి.
2008లో ఈ కేసు నమోదు కాగా 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అనంతరం తీర్పు వెలువడింది. ఆరోపణలు రుజువు కావడంతో ఆ సంస్థ సూపర్వైజర్ ఆకుల కృష్ణమూర్తిని దోషిగా నిర్దారిస్తూ సెక్షన్-409 కింద జీవితఖైదు, రూ. 5వేల జరిమానా, సెక్షన్-420 కింద ఏడేళ్ల కఠిన కారాగారశిక్ష రూ. 5వేల జరిమానా, ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం సెక్షన్-5 కింద పదేళ్ల కఠిన కారాగారశిక్ష రూ. లక్ష జరిమానా విధించింది.
జరిమానాలు చెల్లించకపోతే అదనంగా 16 నెలల పాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని న్యాయస్థానం వెల్లడించింది. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శైలజ, నిందితుల తరపున జి.జితేందర్రెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడు సభ్యత్వం లేనివారి నుంచి డబ్బులు తీసుకుని, తక్కువ జమ చూపించి నిధులు దారి మళ్లించారన్న వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. మొత్తం రూ.53 కోట్లు నిధులు దారి మళ్లినట్లు గుర్తించింది. పొంతన లేని రికార్డులు చూపించి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ప్రాసిక్యూషన్ తరపున పి.శైలజ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఆదేశించినా డిపాజిటర్ల డబ్బు చెల్లించలేదని కోర్టుకు తెలిపారు.
ఇవీ చదవండి: