సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. నాయిని మృతి తనకు చాలా బాధ కలిగించిందన్నారు. వారు గొప్ప కార్మిక నాయకుడని.. కింది స్థాయి నుంచి పోరాటాలు తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకమన్నారు. ఎమర్జెన్సీ కాలంలో తనతో పాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే క్రమంలో సుమారు 16 నెలలుగా చంచల్ గూడ జైలులో ఉన్నారని.. నర్సింహారెడ్డి ఎల్లవేళలా పేదలు, కార్మికుల గురించి.. వారి సమస్యల, హక్కుల గురించి పోరాటాలు చేసేవారని దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో తాను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు.. నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా తనతో పాటు జెనీవాలో జరిగిన కార్మిక సదస్సుకు ఆహ్వానించానని పేర్కొన్నారు. వారు తనతో పాటు అనేక దేశాల్లో పర్యటించారని గుర్తుచేసుకున్నారు. నర్సింహారెడ్డి నిగర్వి, మచ్చలేని రాజకీయ నాయకుడని.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అంకితభావంతో పని చేసే గొప్ప కార్మిక నాయకుడన్నారు. వారి మృతి కార్మిక లోకానికి తీరని లోటని పేర్కొన్నారు.
నాయిని నర్సింహా రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి.. అనేక పోరాటాలు చేసి జైలుకు వెళ్లారని బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఒక మంచి రాజకీయ నాయకున్నేగాక.. ఒక పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. వారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని.. వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట ఘడియల్లో కావలసిన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు.
ఇదీ చదవండి: బుల్లెట్ నర్సన్న కన్నుమూత.. శోకసంద్రంలో తెరాస శ్రేణులు