రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్డౌన్ ఈనెల 29 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ ఈనెల 29 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. జిల్లా, మెజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థలు, జ్యుడీషియల్ అకాడమీలు కూడా అప్పటి వరకు పనిచేయవని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని న్యాయాధికారులకు స్పష్టం చేసింది. హైకోర్టులో కూడా సాధారణ న్యాయ, పరిపాలన పరమైన కార్యకలాపాలు ఈనెల 29వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అత్యవసర కేసులతో పాటు.. తుది విచారణ, అడ్మిషన్ పెండింగ్ కేసుల విచారణను న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టనున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
ఇళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కాలేరని న్యాయవాదుల కోసం.. జ్యుడీషియల్ అకాడమీలో నేటి నుంచి నాలుగు వర్చువల్ కోర్టు గదులను అందుబాటులోకి తెచ్చినట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. రాష్ట్రంలో వినియోగదారుల ఫోరాలు పాక్షికంగా కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇవాళ్టి నుంచి గ్రీన్, ఆరెంజ్ జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఫోరాలు పనిచేస్తున్నట్లు అసిస్టెంట్ రిజిస్ట్రార్ తెలిపారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ లోని మూడు ఫోరాలు సగం మంది సిబ్బందితో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనించాలి : కేటీఆర్