రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఇవ్వాల్సి వస్తే.. తెలంగాణ ప్రపంచంలోనే మొదటి 20 స్థానాల్లో ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేడు యూరోపియన్ బిజినెస్ గ్రూప్(ఈబీజీ) ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పలు దేశాల రాయబారులు, వివిధ దేశాల్లోని ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పట్ల విదేశీ పెట్టుబడిదారుల్లో వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. దేశంలో తెలంగాణ లాంటి పలు రాష్ట్రాలు సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడిదారులు దేశాన్ని స్థూలంగా కాకుండా.. రాష్ట్రాల కోణాల్లోంచి చూడాల్సిన అవసరం ఉంటుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా టీఎస్-ఐపాస్‌తో పాటు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి వివరించారు.
ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో అనేక పారిశ్రామిక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భారతదేశానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల నుంచి పెట్టుబడులను తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా దేశాల్లోని పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు సహకరించాలని రాయబారులను కోరారు. రాష్ట్రం ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, టెక్స్టైల్ వంటి రంగాలకు సంబంధించి పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని కోరారు.