ఆర్టీసీ సమ్మెపై సోమవారం నాటి విచారణను కొనసాగించిన హైకోర్టు... ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 14 వరకు రీఎంబర్స్ మెంట్ బకాయిలు రూ.1099 కోట్లు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. 2014 తర్వాత ఆర్టీసీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని తెలిపింది. బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.125 కోట్లు మాత్రమే ఇక ఇవ్వాల్సి ఉందంది. 2020 మార్చి నాటికి మొత్తం బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.
బకాయిలు చెల్లించారా...?
ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ. 4వేల 253 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్పింది. దీనిపై కలుగజేసుకున్న ధర్మాసనం రూ.4 వేల కోట్లు ఇస్తే... మిగిలిన బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని నిలదీసింది. బ్యాంకు గ్యారెంటీగా ఇచ్చిన రూ.850 కోట్లను కూడా ఇచ్చామని చెప్పటంపై హైకోర్టు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నివేదిక సమర్పించారని... తప్పుదోవ పట్టించేలా లెక్కలున్నాయని ధర్మాసనం పేర్కొంది.
హజూర్నగర్కు రూ.100 కోట్లు ఇచ్చారుగా...
మరోవైపు తక్షణ సమస్యల పరిష్కారం కోసం అడిగిన రూ.47 కోట్లు వెంటనే ఇవ్వలేమన్న ప్రభుత్వ వివరణపైన హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఉప ఎన్నిక జరిగిన పట్టణానికి రూ.100 కోట్లు ఇచ్చినప్పుడు.. రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాల కోసం రూ.47 కోట్లు ఇవ్వలేరా? అని సూటిగా ప్రశ్నించింది. ఒక పట్టణ ప్రజలు ముఖ్యమా? రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమా... అని నిలదీసింది.
ఉద్యోగాలు పోవాలని కోరుకుంటున్నారా...?
సమ్మె విరమించేలా ఆదేశించాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తిని తప్పుపట్టిన కోర్టు... సమ్మె చట్ట విరుద్ధమని మేం ప్రకటిస్తే... కార్మికుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటిస్తే...చట్ట పరంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసా? అని పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు...వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోవాలని కోరుకుంటున్నారా అని పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది.
లెక్కలు నిజమో కాదో తేల్చాలి...
విచారణ సందర్భంగా సమ్మెకు సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావించిన హైకోర్టు...ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది. ప్రభుత్వం రూ.4 వేల 243 కోట్లు ఇచ్చిందా లేదా... ఒకవేళ ఇస్తే అందులో రీఎంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు కూడా ఉన్నాయా లేదా తెలపాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ రూ. 335 కోట్లు చెల్లించింది నిజమేనా కాదో నివేదికలో వివరించాలని ఆదేశించింది. ఈనెల 31లోగా నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం... తదుపరి విచారణను నవంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారిని ఆ రోజున హైకోర్టుకు పంపించాలని ఆదేశించింది.
ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య