రంగారెడ్డి జిల్లా దమగుండం రిజర్వు అటవీ ప్రాంతంలో తూర్పు నావికాదళం(ఈస్ట్రన్ నావల్ కమాండ్) ఏర్పాటు చేస్తున్న 'లో ఫ్రీక్వేన్సీ లైన్(ఎల్ఎఫ్ఎల్) రాడార్' ప్రాజెక్ట్ పనులపై ముందుకు సాగకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దామగుండం రిజర్వు అటవీ పరిరక్షణ ఐకాస దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అటవీ ప్రాంతంలో రాడార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడంపై న్యాయస్థానం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. రక్షణ, భద్రత పరమైన అంశాలు ముఖ్యమైనవే... అయినప్పటికీ పర్యావరణాన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
పూర్తి విరవరాలతో కౌంటరు
ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలంటూ అటవీశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర బయోడైవర్సీటి బోర్డు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నావికా దళాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని సవాలు చేస్తూ... దామగుండం రిజర్వు అటవీ పరిరక్షణ ఐకాస ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
గడువిస్తే కౌంటర్ దాఖలు
రిజర్వు అటవీ ప్రాంతంలో రాడార్ ప్రాజెక్టు నిర్మాణానికి చెట్లను కొట్టివేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్.స్పందనారెడ్డి వివరించారు. స్పందించిన ధర్మాసనం ప్రాజెక్టు అనుమతి ఎప్పుడు ఇచ్చారు? షరతులేంటని అటవీ శాఖను ప్రశ్నించగా... గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ సహాయ న్యాయవాది వి.మధుసూధన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పనులపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన ధర్మాసనం... ప్రతివాదులకు నోటీసులు జారీచేసి తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: వేసవిలో పొంచి ఉన్న ప్రమాదాలు... ముందు జాగ్రత్త చర్యలే రక్ష