TS High court About Double bedroom houses to Transgenders : రెండు పడకల ఇళ్ల కేటాయింపులో అర్హులైన ట్రాన్స్‌జెండర్లను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ట్రాన్స్జెండర్లకు కేటాయించరాదన్న నిబంధన ఏదైనా ఉందా అని ధర్మాసనం ఆరా తీసింది. ఇళ్ల కేటాయింపులో ట్రాన్స్జెండర్లపై ఎలాంటి వివక్ష లేదని.. జీవో ప్రకారం అర్హులైతే చాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాధీవ్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డులు లేవన్న కారణంతో ఇళ్లను కేటాయించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం... జీవోకు అనునుగుణంగా అర్హతలున్న ట్రాన్స్జెండర్లకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని స్పష్టం చేస్తూ పిల్‌పై విచారణను ముగించింది.
సొంతగూడు.. పేదవాడి ఆత్మగౌరవం
Telangana Double Bedroom Houses : పేదవాడి ఆత్మగౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఇళ్ల నిర్మిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మిగతా లక్ష ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. పూర్తయిన ఇళ్లకు సంబంధించి కొన్ని చోట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో పాటు కేటాయింపులు చేయడంతో గృహప్రవేశాలు కూడా చేశారు. లబ్ధిదారులు ఆ ఇళ్లలో నివాసం కూడా ఉంటున్నారు. అయితే మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తైనప్పటికీ లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడంతో పాటు కేటాయింపులు చేయలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయినప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.
అర్హులకే కేటాయింపు
Double Bedroom Houses Allocation : నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 1,100 కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆ మొత్తంతో మిగతా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయవచ్చని చెప్తున్నారు. ఇదే సమయంలో కొత్త ఇళ్ల పనులు ప్రారంభంపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆమోదం అనంతరం అమలు చేసే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. వీటికి ముడిపడి సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థికసాయం అందించే పథకం విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉంటే కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా చేపట్టి నిజమైన అర్హులకే వచ్చేలా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు అధికారులకు సూచించింది.
ఇదీ చదవండి: పెన్షన్ కోసం లింగ మార్పిడి- వృద్ధుడి ప్లాన్ తెలిసి అధికారుల మైండ్ బ్లాంక్!