తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఓటు వివాదంపై ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. కేకే ఓటు రద్దు చేయాలని కోరుతూ తుక్కుగూడ భాజపా కౌన్సిలర్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ ముగించింది. ఏపీ కోటాలో ఎన్నికైన కేకే... తుక్కుగూడలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడం చట్టవిరుద్ధమని భాజపా కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు.
జీవో నెంబర్30 జారీ
ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు ట్రైబ్యునల్ లేనందున హైకోర్టును ఆశ్రయించినట్లు ఈనెల 11న పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. వివాదంపై వివరాలు తెలుసుకొని చెప్పాలని అదే రోజు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే రోజు రాత్రి మున్సిపల్ ఎన్నికల వివాదాలపై విధి విధానాలు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్30 జారీ చేసింది.
ట్రైబ్యునల్ ఏర్పాటు
జిల్లా జడ్జి కోర్టును మున్సిపల్ ఎన్నికల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్‌గా ఏర్పాటు చేశారు. ఇవాళ పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చినప్పుడు... ట్రైబ్యునల్ ఏర్పాటయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని.. నేరుగా తాము విచారణ జరపలేమని పిటిషనర్లకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు