ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించడం లేదన్న కారణంగా కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన విద్యార్థికి ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. మరో కళాశాల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి భవిష్యత్‌ను దెబ్బ తీస్తారా అని వ్యాఖ్యానించింది. జోగులాంబ గద్వాల జిల్లా చిన్నతాండ్రపాడుకు చెందిన విక్రమ్‌కు కన్వీనర్ కోటాలో ప్రతిమ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. అయితే విక్రమ్ అంతకు ముందే బీఎస్సీ అగ్రికల్చరల్ కోర్సులో చేరారు. ఎంబీబీఎస్ సీటు వచ్చినట్లు ఈనెల 22న సమాచారం రావడంతో.. బీఎస్సీ అగ్రికల్చరల్ సీటు రద్దు చేసి తన ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు. అయితే వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వలేమని.. తమ వద్ద ఉన్నాయని కస్టోడియన్ సర్టిఫికెట్ ఇచ్చారు.
కస్టోడియన్ సర్టిఫికెట్ అనుమతించమని.. ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించాల్సిందేనంటూ ఎంబీబీఎస్ సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. విక్రమ్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ ఇవాళ అత్యవసర విచారణ చేపట్టారు. వ్యవసాయ కాలేజీ చేసిన తప్పునకు విద్యార్థిని ఎలా బాధ్యుడిని చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్థి తప్పేమీ లేనందున.. ఎంబీబీఎస్ సీటు కేటాయించాలని ఆదేశించింది. ఒరిజినల్ ధ్రువపత్రాలు కూడా వచ్చాయని విద్యార్థి తెలపడం వల్ల మంగళవారం వెళ్లి నిర్ణీత ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాలు ఇచ్చి కాలేజీలో చేరాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
ఇదీ చూడండి: 'సీఎస్ బిజీగా ఉంటే రెవెన్యూ శాఖను వేరొకరికి అప్పగించండి'