కరోనాతో ప్రజలు చనిపోతుంటే లేని స్పందన దేవరయాంజల్ భూములపై ఎందుకని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏళ్లతరబడి కొనసాగుతున్న వివాదంపై ఇప్పుడే తొందరేమిటని వ్యాఖ్యానించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులిచ్చి.. వివరణ తీసుకున్న తర్వాతే నివేదిక సమర్పించాలని కమిటీకి ఉన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది.
ప్రాథమిక విచారణనే..
మేడ్చల్ జిల్లాలోని దేవరయాంజల్ భూములకు సంబంధించి కొన్నేళ్లుగా వివాదం ఎదుర్కొంటున్న సదా సత్యనారాయణరెడ్డి దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములు సీతారామచంద్రస్వామి ఆలయానివేనని ముందుగా నిరూపించుకోవాలని.. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా... ప్రభుత్వం విచారణ జరుపుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్... ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణనే జరుగుతోందని తెలిపారు. ఇప్పటికిప్పుడు కూల్చివేతల వంటి చర్యలు ఉండవని.. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే.. అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అంతతొందర ఎందుకు?
ఆ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు.. ప్రాథమిక విచారణకూ నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. రికార్డుల ఆధారంగా అధికారులు విచారణ చేసుకోవచ్చు కానీ సమాచారం లేకుండా భూముల్లోకి వాహనాల్లో వెళ్లి.. హడావిడి చేయడమేంటని ప్రశ్నించింది. కొన్నేళ్లుగా వివాదం సాగుతున్న భూములపై ఇప్పుడే అంతతొందర ఎందుకని కోర్టు వ్యాఖ్యానించింది. కరోనా విపత్తుతో ప్రజలు చనిపోతుంటే చూపించని స్పందన.. దేవరయాంజల్ భూములపై ఎందుకు చూపిస్తున్నారని సూటిగా ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు కలెక్టర్లు సహా నలుగురు ఐఎఎస్‌లు కరోనా నియంత్రణ వదిలేసి విచారణ చేయడం... అత్యవసరమా అని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
జోక్యం చేసుకోవద్దు..
దేవరయాంజాల్ భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి విచారణ కమిటీ నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని.. హైకోర్టు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారూ విచారణకు సహకరించాలని స్పష్టంచేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మధ్యంతర ఉత్తర్వులను పొడిగించినందున... పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం.. దేవదాయ శాఖ కమిషనర్, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ బోర్డుకు.. హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చూడండి: ఆస్పత్రుల్లో రోగుల అవస్థలు.. బయట కుటుంబసభ్యుల అష్టకష్టాలు