ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారించింది. చట్టంలో ప్రస్తావన లేకుండా ఎర్రమంజిల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా ఎలా పరిగణించాలని హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనాలు చారిత్రక నిర్మాణాలుగా పేర్కొంటున్న చట్టం లేదా ఉత్తర్వులు ఉంటే చూపాలని పేర్కొంది. చారిత్రక కట్టడాలకు సంబంధించిన హుడా చట్టంలోని నిబంధనను తొలగిస్తూ జీవో ఉన్నందున... దాని ఆధారంగా వాదనలు వినిపించవద్దని స్పష్టం చేసింది. జీవోను సవాల్ చేయకుండా దాని ఆధారంగా రద్దయిన నిబంధనలను ప్రస్తావించడం సరికాదని పేర్కొంది.
పరిహారం అందలేదు
నవాబ్ సఫ్రజర్ జంగ్ ముల్క్ వారసులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. నిజాం ఆస్తులకు సంబంధించిన హైకోర్టు సంరక్షుడి పాత్ర పోషిస్తున్నందున.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను నామమాత్రపు ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. ఎర్రమంజిల్‌లో 12 ఎకరాలకు సంబంధించి తమకు పరిహారం అందలేదని నవాబ్ వారసులు పిటిషన్ లో పేర్కొన్నారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ రేపు కొనసాగనుంది.
ఇవీ చూడండి: కర్నాటకం: మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా