ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల ప్రశ్నపత్రం రూపొందించిన తీరుపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం, పలు ప్రైవేటు వైద్య కళాశాలలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎంసీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్న పత్రం రూపొందించి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడంతోపాటు, సప్లిమెంటరీ కూడా అదే విధమైన ప్రశ్నప్రతం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ 30 మంది వైద్య విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2019 ఎంసీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నపత్రం రూపొందించడం వల్ల పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం తాజాగా పరీక్షలు నిర్వహించేలా, ప్రస్తుతం జరుగుతున్న పారా క్లినికల్ తరగతులకు పిటిషనర్లను అనుమతించేలా ఆదేశించాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: Congress Jung Siren in Mahabubnagar : పాలమూరులో నేడు జంగ్ సైరన్