HIGH COURT FIRES ON GOVERNMENT: పెండింగ్ బిల్లుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి చిన్న విషయానికి ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే పరిస్థితి తీసుకొస్తుందని మండిపడింది. వైఎస్సార్ గ్రామీణ హౌజింగ్ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.58 వేల బిల్లుల కోసం లబ్ధిదారులైన మహిళలను హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి కల్పిస్తారా? అంటూ నిలదీసింది.
పేదలంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటీషనర్లకు సకాలంలో బిల్లులు ఎందుకు చెల్లించలేదో వివరాలతో అఫిడవిట్ వేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించింది. వివరాలు సంతృప్తిగా లేకపోతే అధికారుల హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈమేరకు ఆదేశాలిచ్చారు.
వైఎస్సార్ గ్రామీణ హౌజింగ్ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న తమకు కొంత సొమ్ము చెల్లించగా.. మిగిలిన 58 వేలు అధికారులు చెల్లించలేదని పేర్కొంటూ ఏలూరుకు చెందిన ఆర్. శాంతి సుధాదేవి, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. సోమవారం జరిగిన విచారణలో 58 వేల కోసం పేద మహిళలు హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ హౌజింగ్ పథకం పేరును విజయవంతంగా వైఎస్సార్ హౌజింగ్ పథకంగా మార్చుకున్న ప్రభుత్వం.. పేదలకు సకాలంలో ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ప్రశ్నించారు. పేదలంటే ఎందుకంత కక్ష అని ఘాటుగా స్పందించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. మరోవైపు ఉద్యోగుల భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించడం ఏమిటని ప్రశ్నించింది. ఈ విషయాన్ని పత్రికల్లో చూశానని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ముపై ప్రభుత్వానికి హక్కు ఎక్కడిదని ప్రశ్నించింది.
ఇవీ చదవండి: