కరోనా పరీక్షలు, వైద్యులకు వ్యక్తిగత రక్షణ కిట్లు తదితర అంశాలపై విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ సేన్ రెడ్డిల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కరోనాకు సంబంధించి ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు నిర్వహించాలన్న విధానం వెనుక శాస్త్రీయ కారణాలేంటో చెప్పాలంటూ... ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత ఎక్కువమందికి పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదో స్పష్టతనివ్వాలని ఆదేశించింది.
కంటైన్మెంటు జోన్లు ఎన్ని?
కంటైన్మెంట్ జోన్లలో ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం లేదని.. దానివల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. న్యాయస్థానం స్పందిస్తూ...కంటైన్మెంటు జోన్లు ఎన్ని? వాటిలో ఎంత మంది ప్రజలు ఉంటారని అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. మృతదేహాల నుంచి రక్తనమూనాలు సేకరించి.. పరీక్షలు నిర్వహించకూడదన్న నిర్ణయం వెనక ఆంతర్యమేంటో చెప్పాలంది. పరీక్షలు చేయకపోతే ఎందుకు మరణించారో తెలియదని.. అది ప్రమాదకర సంకేతమని ఆందోళన వ్యక్తం చేసింది.
విచారణను ఈ నెల 14కు వాయిదా
కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నట్లు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల్లో ఎక్కడ ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తిస్థాయి పరీక్షలు చేయకుంటే రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై వాస్తవాలు తెలియవని.. ఇది గణాంకాలతో గజిబిజి చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయాలకు కారణాలు చెప్పాలంటూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.
కూరగాయలు, పండ్లు ధరలపై
విపత్తు సమయంలో నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు, పండ్లు ధరలపై నియంత్రణ లేకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ధరల పెరుగుదలపై పత్రికల్లో వచ్చిన వార్తలను.. హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది. విపత్కర పరిస్థితుల్లో సగం జీతాలే పొందుతున్నవారు... ఆకాశాన్నంటుతున్న ధరలతో బతుకులెలా వెళ్లదీయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుబ్రహ్మణ్యం 10 మార్కెట్లు, రైతుబజార్లు, జనరల్ బజార్లను సందర్శించి రూపొందించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది.
పండ్ల విక్రయాలకు చేసిన ఏర్పాట్లపైనా
ధరలు పెంచుతున్నవారిని ఎవరూ అడ్డుకోవడం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నిత్యావసరాల సరఫరాను పర్యవేక్షిస్తోందని అడ్వకేట్ జనరల్ బీ.ఎన్. ప్రసాద్ తెలుపగా.. అలాగైతే ధరలు ఎందుకు పెరిగాయని ప్రశ్నించింది. ధరల నియంత్రణకు తీసుకున్న చర్యలు వివరించాలని ఆదేశిస్తూ విచారణను వారానికి వాయిదా వేసింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పండ్ల విక్రయాలకు చేసిన ఏర్పాట్లపైనా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి : భోపాల్ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్ లీక్లెన్నో..