రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది దాటితే చాలు.. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. పగటి వేళల్లో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. నిత్యం జనంతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు... పగటి వేళలో జనంలేక నిర్మానుష్యంగా మారాయి. ఏదైనా పనికోసం బయటకి వచ్చినవారు... శీతల పానీయాలు సేవిస్తూ.... చెట్ల నీడన సేద తీరుతున్నారు.
రాష్ట్రంలో 45 నుంచి 47 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.5 డిగ్రీలు నమోదుకాగా... ఆదిలాబాద్ జిల్లాలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అత్యల్పంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42.7 డిగ్రీలు ఉండగా... రంగారెడ్డిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో రెండు వారాల పాటు ఎండ తీవ్రంగా ఉండడంతోపాటు.. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి... జనం బయట తిరగకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలపై ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగుతో పాటు గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, మజ్టిగ వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు