Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వాన హోరుతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది.
ట్యాంక్‌బండ్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేట ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరద నీరు రహదారులపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి ఉన్న తూర్పు-పశ్చిమ ద్రోణి ఈ రోజు బలహీన పడినట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నట్లు తెలిపింది. రాగల 24 గంటల్లో ఈశాన్య దాని పరిసరాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి: దేశంలో విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాల్లో మూడు మనవే!
దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం.. 5జీ సేవలు ప్రారంభించిన ప్రధాని