హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఫలితంగా మూడు రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందిపడుతోన్న నగరవాసులు ఉపశమనం పొందారు. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి కురిసిన జోరువానతో ఒక్కసారిగా చల్లబడింది.
నగరంలోని కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, లిబర్టీ, లక్డీకాపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్.ఆర్.నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజీగూడ, నారాయణగూడ, కోఠి, బేగంబజార్, అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మరోవైపు భారీ వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాహనదారులు తడిసి ముద్దయ్యారు. రాకపోకలకు అంతరాయం కలగడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి: Revanth Reddy: రేపు రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.. ముమ్మరంగా ఏర్పాట్లు