క్యుములోనింబస్ మేఘాల వల్ల హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వరుణుడి ప్రతాపానికి నగరంలో రోడ్లు కాలువలను తలపించాయి. ప్రధాన రహదారులపై వరదనీరు చేరడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేసీపీ జంక్షన్, మోడల్ హౌజ్, లక్డీకాపూల్, కోఠి ప్రధాన రహదారులపై మోకాలు లోతు వర్షపు నీరు చేరింది.
నగరంలో వరుణుడి ప్రతాపం
నగరంలో చాలా చోట్ల 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అమీర్‌పేట్ మైత్రీవనంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా... బంజారాహిల్స్‌లో 4.5... యూసూఫ్ గూడ కృష్ణానగర్‌లో, మోతినగర్‌లో 4.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్‌లో 3.7, బాలానగర్‌లో 2.7, టోలీచౌక్‌లో 2.5, జూబ్లీహిల్స్‌లో 2.4 సెంటిమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాయదుర్గంలో 2.2, బేగంపేట్‌లో 2.1, శ్రీనగర్ కాలనీలో 1.8, అసిఫ్ నగర్లో 1.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
నేలకొరిగిన చెట్లు... పొంగి పొర్లిన డ్రైనేజీలు
నగరంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగి రాకపోకలు నిలిచిపోయాయి. చెట్ల కొమ్మలు వాహనాలపై పడి అద్దాలు దెబ్బతిన్నాయి. బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 10లో రహదారిపై చెట్టు కూలిపోయింది. సింగాలిబస్తీలో ఓ ఇంటిపై పక్కింటి గోడ కూలిపడింది. అఘాపూరలో చెట్టు కూలి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యూసుఫ్ గూడ ప్రేమ్ నగర్ బస్తీలోని లోతట్ట ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. శ్రీకృష్ణ నగర్లో మ్యాన్ హోళ్లు పొంగి పొర్లి.... రహదార్లను మురుగు నీరు ముంచెత్తింది. జీహెచ్ఎంసీకి చెందిన డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్లను తొలిగిస్తున్నారు. వరద నీటిని తరలించడానికి చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ