వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజులుగా జనజీవనం స్తంభించింది. భారీ వరద నీటితో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమై.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి నీరుచేరడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
మోకాళ్ల లోతు నిలిచిన వర్షం..
జంటనగరాల్లోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, మైత్రివనం, బాలానగర్, జీడిమెట్ల, సుచిత్ర, కుత్బుల్లాపూర్, యూసఫ్‌గూడ, వెంగళ్రావు నగర్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, పాతబస్తీ, జూపార్కు, బహదూర్‌పురా, పురానాపూల్, గోల్కొండ, లంగర్‌హౌస్, కార్వాన్, జియాగూడ, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లిలో వర్షం పడింది. హిమాయత్ నగర్‌లో మోకాళ్ల లోతు వర్షం నీరు నిలిచిపోయింది. అలాగే బషీర్ బాగ్‌లోని సీపీ కార్యాలయం నుంచి పీజీ న్యాయ కళశాల మీదుగా కింగ్ కోఠి వరకు మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నిండుకుండలా హిమాయత్ సాగర్..
ఎల్బీనగర్ పరిధిలోని కాలనీల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యటించారు. జోరువానల దృష్ట్యాప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాలకు నగరశివారులోని హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 17 వందల 62 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు. జలాశయంలోకి 833 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. వాతావరణశాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం