గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 513.64 మీటర్లకు చేరింది.
ఫలితంగా జీహెచ్ఎంసీ లేక్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు అలుగులు, ఒక తూము ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ గేట్ల వద్ద అడ్డుగా ఉన్న చెత్తా చెదారాన్ని క్లీన్ టెక్ మిషన్లు, సిబ్బంది ద్వారా తొలగిస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే వదులుతున్నప్పటికీ.. నీటి మట్టం పెరుగుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా 240 చదరపు కిలో మీటర్లు ఉండగా.. ఈ ప్రాంతం మొత్తాన్ని వర్షం ముంచెత్తుతోంది.
మరోవైపు ట్యాంక్‌బండ్ దిగువనున్న లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మురళీ కృష్ణ వెల్లడించారు. నిరంతరం జోనల్ కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్ల సమన్వయంతో జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బల్కాపూర్ నాలా, పికెట్, ఖైరతాబాద్, కూకట్పల్లి నాలాల నుంచి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. సాగర్ నుంచి దిగువకు నీటిని వదులుతున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఇదీచూడండి: విస్తారంగా వర్షాలు... హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు