Compensation for Forest Officers: అటవీ రక్షణలో భాగంగా విధి నిర్వహణలో అసాంఘిక శక్తుల దాడుల్లో మరణించే అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి విధాన పరమైన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాడుల్లో మరణించే ఐఎఫ్ఎస్ అధికారులకు రూ.కోటి, కన్జర్వేటర్లకు రూ.75 లక్షలు, రేంజ్ అధికారులకు రూ.50 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నారు. సెక్షన్ అధికారులు-డిప్యూటీ రేంజర్లకు రూ.45 లక్షలు, బీట్ అధికారులకు రూ.30 లక్షలు పరిహారంగా అందిస్తారు.
శాశ్వత వైకల్యం ఏర్పడితే ఐఎఫ్ఎస్ అధికారులకు రూ.50 లక్షలు, కన్జర్వేటర్లకు రూ.40 లక్షలు, రేంజ్ అధికారులకు రూ.30 లక్షలు పరిహారంగా ఇస్తారు. సెక్షన్ అధికారులు - డిప్యూటీ రేంజర్లకు రూ.25 లక్షలు, బీట్ అధికారులకు రూ.20 లక్షలు పరిహారంగా అందిస్తారు. తీవ్రంగా గాయపడితే ఐఎఫ్ఎస్ అధికారులకు రూ.6 లక్షలు, కన్జర్వేటర్లు, రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు - డిప్యూటీ రేంజర్లకు రూ.5 లక్షలు పరిహారంగా ఇస్తారు. తీవ్రంగా గాయపడితే బీట్ అధికారులకు రూ.3 లక్షలు పరిహారంగా అందిస్తారు.
పరిహార విధానాన్ని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పీసీసీఎఫ్ డోబ్రియల్, అటవీ శాఖ ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
గుత్తికోయల దాడిలో అధికారి మృతి..: 2022 నవంబర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు అటవీ ప్రాంతంలో పోడు భూముల సాగుదారుల దాడిలో శ్రీనివాసరావు అనే ఓ అటవీ రేంజ్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. అటవీ భూములను కాపాడేందుకు వెళ్లిన ఆ అధికారిపై గుత్తికోయలు కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తోటి అధికారులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అప్పట్లో తీవ్రంగా స్పందించారు. ఫారెస్ట్ అధికారులపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. అటవీ అధికారులు మనోస్థైర్యం కోల్పోవద్దని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా అసాంఘిక శక్తుల దాడుల్లో మరణించే అటవీ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది.
ఇవీ చూడండి..
ఎవ్వరైనా సరే తగ్గేదే లే.. అదనపు కలెక్టర్‌పై కుక్క దాడి
"కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌కి కస్టోడియన్ ఎవరుంటారు? బాధ్యత ఎవరిది?"