TRS MLAs Poaching Case Update: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ముగ్గురు నిందితుల తరఫున ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. కేసును కేవలం రాజకీయ కోణంలోనే నమోదు చేశారన్న జెఠ్మలానీ... దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిజాయతీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కానీ ప్రస్తుతం దర్యాప్తు ఆ విధంగా జరగట్లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. వారి కనుసన్నల్లోనే పని చేస్తోందని వాదించారు.
ఫామ్‌హౌజ్‌లో ఘటన జరిగినరోజు సైబరాబాద్ పోలీసు కమిషనర్ మీడియాకు వివరాలు చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు సీజేతో పాటు మిగతా రాష్ట్రాల సీజేలకు దర్యాప్తునకు సంబందించిన సీడీ, ఇతర మెటీరియల్స్‌ను సీఎం పంపారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తునకు సంబంధించి ఏ విధమైన సమాచారం బయటకు పొక్కనియకుండా దర్యాప్తు అధికారి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందని.. కానీ ప్రస్తుతం మీడియాకు లీకులు వస్తున్నాయని వివరించారు. దర్యాప్తు ఎలా జరగాలనే విషయంపై పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఉటంకించిన న్యాయవాది మహేష్ జెఠ్మలానీ... ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చారు. కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరారు.
ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రంగా కుట్ర జరిగింది : ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీతో పాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కౌంటర్ దాఖలు చేశారు. నిందితులకు, బీజేపీ నేతలకు జరిగిన వాట్సాప్ సంభాషణతో పాటు పలువురు పెద్దలతో దిగిన ఫొటోలను జతపర్చారు. భోజన విరామం అనంతరం ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు న్యాయవాది దవే వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్ర నేరమైన కేసు అని తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కేంద్రంగా... ఇందులో కుట్ర జరిగిందని వాదించారు. భాజపాకు సంబంధం లేదంటూనే నిందితుల తరుపున పిటిషన్లు వేస్తున్నారని.. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి కదా అని తెలిపారు.
ఈ వ్యవహారంలో కేసు నమోదైన మరుక్షణం నుంచే బలహీనం చేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. గడిచిన కొన్నేళ్లలో భాజపా అనేక ప్రభుత్వాలను పడగొట్టిందని... ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొని చార్టెడ్ ఫ్లైట్లలో తీసుకెళ్లారని కోర్టు దృష్టికితెచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ , గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రమాదంలో పడినప్పుడు పార్టీ అధినేతగా, సీఎంగా స్పందించే హక్కు సీఎంకు ఉంటుందని దవే తెలిపారు. ఈ వ్యవహారంలో జరిగిన విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి కచ్చితంగా ఉంటుందని, ఇందులో భాగంగానే మీడియా, కోర్టులకు ఆధారాలతో చూపించారని వాదించారు. నాలుగు గంటలపైగా జరిగిన వాదనలు విన్న కోర్టు... విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: