మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట భూములు ఈటల కబ్జా చేశారంటూ రైతులు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత సీఎం విచారణకు ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖను బదిలీ చేయాలన్న ప్రభుత్వం సిఫారసుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఆమోదంతో శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ మారారు.
శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్‌పై మెదక్ జిల్లాకు చెందిన కొందరు రైతులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు లేఖపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ వ్యవహారంపై నిగ్గుతేల్చాలని ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ వివాదానికి కేంద్రంగా నిలిచిన మాసాయిపేట, హకీంపేట అసైన్డ్ భూముల్లో సర్వేకు రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.
మంత్రి ఈటలకు చెందిన హేచరీస్ సహా అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే చేశారు. మంత్రి ఈటలపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి ఏసీబీ, విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అసైన్డ్ దారులను ఒక్కొక్కరిగా పిలిచి సమాచారం తెలుసుకున్నారు. విచారణను పర్యవేక్షించిన... మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ .. ప్రాథమికంగా అసైన్డ్ భూములు కబ్జా జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో... తనంతట తాను మంత్రి పదవికి రాజీనామా చేయని పక్షంలో మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది
ఇదీ చదవండి: మంత్రి ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ సీఎంకు బదిలీ