ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో ఏప్రిల్ తర్వాత అమల్లోకి తెస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దీనిద్వారా 26 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ కింద 84 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారని వెల్లడించారు. కేంద్ర పథకం ద్వారా వచ్చే నిధులు తక్కువేనని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల వైద్య పథకాల కోసం ఏడాదికి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పథకాల కింద చికిత్సలు అధిక శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే విధంగా చూస్తామని, అందుకనుగుణంగా సర్కారు దవాఖానాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. కోఠిలోని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఈటల శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
కొవిడ్ బారిన పడిన వారికి ఊపిరితిత్తుల సమస్యలుంటే ఛాతీ ఆసుపత్రికి, బహుళ అవయవ సమస్యలుంటే గాంధీకి, సాధారణమైతే టిమ్స్‌కి తరలించి చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఒక వార్డు మినహా అన్ని వార్డుల్లోనూ సాధారణ వైద్యసేవలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి కొవిడ్ టీకాల ప్రక్రియ ముగిసిందన్నారు. శనివారం నుంచి పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్ సిబ్బందికి వాక్సిన్ వేస్తారని వెల్లడించారు.
ఇదీ చూడండి: ' నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్'