దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కోవిడ్-19పై సచివాలయంలో రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశమైంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో చేరిన వ్యక్తికి పూర్తిగా నయమైందని.. త్వరలో డిశ్చార్జ్ చేయబోతున్నామని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఒక్క కేసు కూడా పాజిటివ్ లేదన్నారు.
ఎవరిని కలవద్దు
అంతర్జాతీయ విమానాశ్రయానికి స్టాండ్ థర్మో స్క్రీన్లు అందించామని మంత్రి తెలిపారు. విమానాశ్రయంలో ప్రతి విదేశీ ప్రయాణీకులను స్కాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. బయటి దేశం నుంటి వచ్చే వారు కచ్చితంగా 14 రోజులు ఇంట్లోనే ఉండాలన్నారు. అటువంటి వారు కుటుంబసభ్యులను, బయటి వారిని ఎట్టిపరిస్థితుల్లో కలవవద్దని సూచించారు.
104కు సమాచారం అందించండి
విదేశాల నుంచి వచ్చే వారి ద్వారా మాత్రమే రాష్ట్రానికి కోవిడ్-19 వైరస్ వచ్చే అవకాశం ఉందని.. అందరూ సహకరించాల్సిందిగా ఈటల రాజేందర్ కోరారు. వారికి 104 కాల్ సెంటర్ నుంచి ఫోన్లు వస్తాయని.. దయచేసి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. కాన్ఫరెన్స్‌లు, సదస్సులు కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని మంత్రి ఈటల సూచించారు.
ఇదీ చూడండి : అమెరికా వెళ్లొచ్చిన నిట్ విద్యార్థి.. కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చేరిక