కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులో ఉన్నప్పటికీ ప్రజలను మాస్కుల వినియోగం, సానిటైజర్ వాడకంపై మరింత అప్రమత్తం చేయాలని ఈటల కోరారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అమెరికా, యూరప్ దేశాలలో కేసులు పెరుగుదల.. దేశంలోనూ దిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్న తీరుపై చర్చించారు.
రాష్ట్రంలోనూ బతుకమ్మ మొదలుకొని దసరా పండుగ వరకు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో బయటకు రావడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. వీటితోపాటుగా చలికాలం కావడం వల్ల వైరస్ తీవ్రత పెరుగుతుందనే అభిప్రాయం కూడా ఉన్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు అందించాల్సిన సూచనపై సుదీర్ఘంగా చర్చించారు. చలికాలం కావటం వల్ల మరింత కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలకు మాస్కులు, సానిటైజర్లను విరివిగా వినియోగంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక వ్యాక్సిన్‌పై విస్తృత ప్రయోగాలు జరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రజలందరీ అందేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు , ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ... పట్టణాల్లో మున్సిపల్ శాఖ అధికారులతో, గ్రామాలలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా కొవిడ్ నియంత్రణ, చికిత్సల కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ఆధికారులు వివరించారు. ఇప్పటికే కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు అన్ని ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని వివరించారు. అధిక వర్షాల వల్ల నీరు ఎక్కువగా కలుషితం అయిందని.. డయేరియా లాంటి జబ్బులు రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
దేశంలో కరోనా మరణాల రేటు 1.5శాతం ఉండగా రాష్ట్రంలో మాత్రం కేవలం 0.6శాతం ఉందన్నారు. ఇక పాజిటివిటి రేటు కేవలం 3.5 శాతం ఉండగా జాతీయ సగటు మాత్రం 7.8శాతంగా ఉందని గుర్తు చేశారు. రోగులకు చికిత్సకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రంలో 25,574 ఐసోలేషన్ పడకలు, 10,849 ఆక్సిజన్ పడకలు, 5,381 ఐసీయూ పడకలు, వెంటిలేటర్స్ 3,510 అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఇదీ చదవండి: 'దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి'