TS Health Minister Interview : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తాగునీటి సమస్యలన్నింటినీ పరిష్కరించామని... పక్కరాష్ట్రమైన మహారాష్ట్రలో నాలుగైదు రోజులకోసారి నీళ్లు వచ్చేవి కావని... కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా..ఈనాడుకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.
దశాబ్ది ప్రారంభ ఉత్సవాల ప్రాధాన్యమేంటి?
రాదనుకున్న తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం. ఉద్యమకారులు పరిపాలన చేయలేరని, నక్సలైట్ల రాష్ట్రం అవుతుందని, మతకల్లోలాలు జరుగుతాయని, పరిశ్రమలు మూతపడతాయని కరెంటు ఉండదని, ఇలా రకరకాల మాటలు రాష్ట్ర ఆవిర్భావ సమయంలో విన్నాం. ఇవన్నీ అసత్యాలనీ చెప్పి రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో అద్భుతాలు సృష్టించాం. దశాబ్దాలుగా పడిన తెలంగాణ ప్రజలు కష్టాలను దూరం చేయగలిగాం. ఇంత గొప్పగా రాష్ట్ర ప్రతిష్ఠను, గౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగింది. ఈ విజయాలను ప్రజల ఆనందోత్సాహాల మధ్య అద్భుతంగా జరపాలన్నది ప్రభుత్వ నిర్ణయం. తొమ్మిది సంవత్సరాలు పూర్తయి దశాబ్దిలోకి అడుగు పెడుతున్న తరుణంలో ఈ ఉత్సవాలను 21 రోజులపాటు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలే కేంద్రబిందువులుగా తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, నెరవేరిన లక్ష్యాలు, అప్పటి పరిస్థితికి నేటి పరిస్థితికి తేడా ఏంటని ప్రజలకు కళ్లకు కట్టేలా తెలిపేలా చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం.
దశాబ్దం ముగిసే సమయంలో ఉత్సవాలు చేస్తారు. కానీ ప్రారంభంలోనే చేయడానికి కారణమేంటి? ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారన్న అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమవుతోంది కదా?
చేసింది చెప్పుకోవడంలో తప్పేముంది? తెలంగాణలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది. నాటి రోజుల్లో మహిళలు ఎండాకాలంలో మంచినీటి కోసం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనగాగుతోంది. ఆసరా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, వికలాంగుల పింఛన్.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో, దేశంలో ఎక్కడా లేని విధంగా చేశాం. ఎంత పేదవారైనా తిండికి ఇబ్బందిపడే పరిస్థితి లేదు. ఒకప్పుడు కరవు కాటకాలు, కరెంటు కోతలు, పంటలు ఎండిపోవడం వంటి పరిస్థితులుండేవి. ఇప్పుడు పండిన పంటను నిల్వ చేసుకోవడానికి గోదాములు కూడా సరిపోని పరిస్థితి. కోతలకు, నాట్లకు, పక్క రాష్ట్రాల నుంచి కూలీలు రావాల్సిన పరిస్థితి. ఇది కచ్చితంగా అద్భుతమైన విజయం. ఈ విజయోత్సవాల్లో రైతులు పాలుపంచుకొంటారు. గిట్టనివారు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు. అవన్నీ వాస్తవాలు కావు.
కానీ రైతుకు ప్రభుత్వ సహకారం లేదంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి కదా..?
గతంలో ఎరువులు దొరక్క ఎక్కడ చూసినా రైతుల క్యూలైన్లు, భయపడి పోలీసుస్టేషన్లలో పెట్టి విక్రయించే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? కరెంటు కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎదురు చూడటం, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, పంటలు ఎండిపోవడం నాడు దైనందిన జీవనంలో భాగమయ్యేది. ఇప్పుడు ఎక్కడైనా ఆ పరిస్థితి కనిపిస్తోందా? 15,500 మెగావాట్ల లోడు వచ్చినా ఇబ్బంది లేకుండా రైతుకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు కింద నగదు బదిలీ చేసిన మొదటి నాయకుడు కేసీఆర్, మొదటి ప్రభుత్వం తెలంగాణ. ఇక్కడ రైతుకు అన్ని రకాల భరోసా ఉంది. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనక ఆ రైతులు ఇక్కడ అమ్ముకొంటున్నారు. మనం 2 సీజన్లలోనూ కొంటున్నాం. మహారాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ తరహా విధానం కావాలని కొందరు అడిగితే.. అధ్యయనం చేయడానికి అధికారులతో కమిటీని నియమించారు.
తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో.. ఆ దిశలో పయనం కొనసాగుతోందా?
నూటికి నూరు శాతం. గోదావరి జలాలను మళ్లించే గొప్ప ప్రయత్నం జరిగింది. కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసుకున్నాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చివరిదశలో ఉంది. సీతారామ ఎత్తిపోతల కూడా కొద్దిరోజుల్లోనే పూర్తి కానుంది. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు, ఎస్సారెస్పీ రెండోదశను పూర్తి చేశాం. ఇప్పుడు సగం తెలంగాణకు కాళేశ్వరం నీళ్లందుతాయి. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటా సాధించుకున్నాం. మిషన్ మన నీళ్లను మన బీడు భూములకు మళ్లించుకొంటామని ఏ మాటలైతే చెప్పామో, ఏ పాటలైతే పాడామో వాటిని అక్షరాలా నిజం చేసింది తెలంగాణ ప్రభుత్వం.
రాష్ట్రానికి నిధుల లభ్యత, వాటి వినియోగంపై మీ విశ్లేషణ ఏమిటి?
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు.. తెలంగాణలోని పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడిన జిల్లాలే. ఈ రోజు మొత్తం తెలంగాణ అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. ఇక్కడి నిధులు ఇక్కడే వినియోగిస్తుండటంతో అన్ని జిల్లాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తలసరి ఆదాయం రూ.3.05 లక్షలైంది. తలసరి విద్యుత్తు వినియోగం, వ్యవసాయ ఉత్పత్తి, విద్య, వైద్యంలో అగ్రగామిగా ఉన్నాం. అంటే మొదటి మూడు స్థానాల్లో నిలిచాం. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యలో నంబర్ వన్‌గా నిలిచాం. దేశంలో అత్యధిక గురుకుల కళాశాలలున్నది తెలంగాణలోనే. సంపద పెంచి పేదలకు పంచే ప్రయత్నం చేశాం. ఆనాడు సంపద అవినీతి రూపంలో నాయకులు, అధికారుల దగ్గరకు వెళ్లింది. కాంగ్రెస్ ఉన్న పదేళ్లలో ఇసుక ఆదాయం రూ.50 కోట్లు దాటలేదు. కానీ తెలంగాణ వచ్చాక మొదటి అయిదేళ్లలోనే రూ.5000 కోట్ల దాకా తీసుకెళ్లాం. మేమొచ్చాక పారదర్శకత పెంచి ప్రతి రూపాయి ఖజానాలోకి చేరేలాగా చేశాం. గతంలో పదేళ్లలో పెట్టిన పెట్టుబడి వ్యయం ఇప్పుడు రెండేళ్లలోనే పెట్టాం. మన నిధులు మనకు దక్కడం వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణలో రహదారులు ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడైనా గుంతలు కనిపిస్తున్నాయా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా గోతులే. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికీ అదే పరిస్థితి. మండల కేంద్రానికి రెండు వరుసల రోడ్లు, జిల్లా కేంద్రానికి నాలుగు వరుసల రోడ్లు వేశాం.
ఉద్యోగ నియామకాల మాటేమిటి?
రాష్ట్రం ఏర్పడిన మొదటి అయిదేళ్లలో 1.50 లక్షల ఉద్యోగాలిచ్చాం. ప్రస్తుతం 80 వేల ఉద్యోగాలు భర్తీచేసే ప్రక్రియ కొనసాగుతోంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. ఆరోగ్యరంగంలో రెండువేల మంది వైద్యులను నియమించాం. ఒక్క ఖాళీ కూడా లేకుండా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రైవేటు రంగంలో భారీగా పెట్టుబడులు రావడంతో కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఐటీ, తయారీ, టెక్స్‌టైల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. నిర్మాణరంగం పెరిగి ఇతర రాష్ట్రాల నుంచి 5, 6 లక్షల మంది వచ్చి పని చేసే పరిస్థితి ఉంది.
పునర్విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. విభజన చట్టంలోని అంశాలు ఓ కొలిక్కి రాకపోవడానికి కారణాలేమిటి?
రాష్ట్రానికి రావాల్సిన వాటాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరిని అవలంబిస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ హక్కునూ కోల్పోవడానికి మేం సిద్ధంగా లేము. రాజధానిలోని హెచ్‌వోడీల కార్యాలయాల్లో వాటా కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. విభజన చట్టం ప్రకారం ఎక్కడ ఉన్నవి అక్కడి ప్రభుత్వానికే అని చెప్పారు. కానీ దీనికి భిన్నంగా మొండిగా వాటా అడుగుతున్నారు. రాష్ట్రానికి 4000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్తు ఇవ్వాలని చట్టంలో చెప్పారు. తొమ్మిదేళ్లయ్యింది. ఇప్పటివరకు ఒక్క మెగావాట్ కూడా ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఇలా ఏమీ లేకుండా రాష్ట్రానికి కేంద్రం తీవ్రమైన అన్యాయం చేసింది.
రాష్ట్రంలో అవినీతి ఎక్కువగా ఉందని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి..?
కాంగ్రెస్‌కు, భాజపాకు అవినీతి గురించి మాట్లాడే హక్కులేదు. కాంగ్రెస్ హయాంలో ఇసుక విధానమే దీనికి నిదర్శనం. రైతుబంధు కింద రూ.80 వేల కోట్లు ఇస్తే ఇందులో దళారులు ఎక్కడున్నారు? కల్యాణలక్ష్మి కింద నేరుగా రూ.లక్ష చెక్కు ఇస్తున్నాం, ఆసరా కింద రూ.2000 నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమవుతోంది. ఇందులో ఎక్కడైనా అవినీతికి ఆస్కారం ఉందా? ప్రతి రూపాయి లబ్ధిదారులకు చేరేలా ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరిస్తోంది.
వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భాజపా, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి కదా?
అలా చెప్పకపోతే వాళ్లకున్న కార్యకర్తలు కూడా జారిపోతారు. అందుకే వాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. భారాస హ్యాట్రిక్ సాధిస్తుంది, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భాజపాకు 75 శాతం స్థానాల్లో, కాంగ్రెస్‌కు 50 శాతం స్థానాల్లో అభ్యర్థులే లేరు. మా పార్టీలో చేరండంటూ అందరి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. రహస్య సమావేశాలు పెట్టుకొని కాళ్లు, చేతులు పట్టుకుంటున్నారు. పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా లేని పార్టీలు అధికారంలోకి రావడం కలలో కూడా జరగదు. వాళ్లకి ప్రతిపక్ష హోదా రావడమే చాలా కష్టం.
రానున్న రోజుల్లో ఎక్కువగా ఎలాంటి అభివృద్ధి పనులపై దృష్టి సారించబోతున్నారు?
కలెక్టరేట్లను, వైద్యకళాశాలలు, నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను పూర్తి చేస్తాం. రెండువేల పడకలతో నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీని దసరా లేదా ఏడాది ఆఖరుకు ప్రజలకు అందిస్తాం. సీతారామ ఎత్తిపోతలను త్వరితగతిన అందుబాటులోకి తెస్తాం. మూడు, నాలుగు నెలల్లో పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసి ప్రజలకు నీళ్లందిస్తాం. 4000 మె.వా. యాదాద్రి అల్ట్రా మెగాపవర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. విద్య, వైద్యంపై మరింత ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తాం. వచ్చే టర్మ్‌లో ఈ రెండింటి లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్తాం.
ఇవీ చదవండి: