రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల పురోగతిని సమీక్షించేందుకు ప్రతివారం కేంద్ర, రాష్ట్ర అధికారులు సమావేశం కావాలని నిర్ణయించారు. బీఆర్కే భవన్లో జరిగిన కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో... సీజీఎస్టీ హైదరాబాద్ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్యా, రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, సీజీఎస్టీ హైదరాబాద్ ప్రిన్సిపల్ కమిషనర్ పురుషోత్తం, అధికారులు పాల్గొన్నారు.
పన్నుల వసూళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం, పరస్పర సహకారంపై సమావేశంలో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి లభిస్తుందని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో పన్ను వసూళ్లకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని చెప్పారు.
ఇదీ చదవండి: 'తల్లిపాలు ఎంత విలువైనవో... మాతృభాష కూడా అంతే...'