జీహెచ్‌ఎంసీ దోమల నివారణ విభాగం నిర్లక్ష్యంతో మూసీ పరివాహక ప్రాతంలో దోమల సమస్య అంతకంతకు తీవ్రమవుతోంది. అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై గుర్రపుడెక్క తొలగింపును ఏజెన్సీలకు అప్పగించడం, డ్రోన్ల రూపంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. లార్వా ఉత్పత్తికి వేసవికాలం అనుకూలం కాదు. కేవలం ఏజెన్సీలు గుర్రపుడెక్కను తొలగించకపోవడంతో వాటి కింద దోమలు వృద్ధి చెందుతున్నాయని స్పష్టమవుతోంది.
విజృంభిస్తున్న క్యూలెక్స్ దోమలు
అధిక ఉష్ణోగ్రతలనూ తట్టుకుని నగరవ్యాప్తంగా క్యూలెక్స్ దోమ విపరీతంగా వృద్ధి చెందుతోంది. వాటి గుడ్డు పెరిగేందుకు గుర్రపుడెక్క అనుకూలిస్తోంది. అధికారులు దాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గతంలో గుర్రపుడెక్క ఉన్న చెరువులను తరచుగా శుభ్రం చేసేవారు. గుర్రపుడెక్క భారీగా ఉన్న బండ్లగూడ చెరువును సిబ్బంది 20 రోజుల్లో శుభ్రం చేశారు. దోమలపై ఫిర్యాదులొస్తే చుట్టు పక్కల ప్రాంతాల్లోని నీటి కుంటల్లో ఎంఎల్‌ఓ ఆయిల్‌తో తడిపిన రంపపు పొట్టు బంతులను విసిరేవారు. దోమల మందును పిచికారి చేశారు. ఇప్పుడు ఆయా కార్యక్రమాలు పడకేశాయి. చెరువుల్లో మందు చల్లడం, గుర్రపుడెక్క తీయడం వంటి పనులను అధికారులు ప్రైవేటుపరం చేశారు. అప్పట్నుంచి నిధులు ఖర్చవడం మినహా, ఫలితం ఉండట్లేదన్న విమర్శలొస్తున్నాయి.
ఫలితమివ్వని డ్రోన్లు
ఒకప్పుడు నాగోల్ నుంచి బాపూఘాట్ వరకు జీహెచ్‌ఎంసీ దోమల నివారణ విభాగం 200 మంది సిబ్బందిగల 18 బృందాలతో పని చేయించేది. దీంతోపాటు మూసీ అభివృద్ధి సంస్థ కూడా దాదాపు 60 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంది. నిధులు లేవన్న కారణంతో మూసీ సంస్థ తమ సిబ్బందిని తొలగించింది. గుర్రపుడెక్క తొలగింపు, దోమల మందు పిచికారిని విస్మరించారు. ఈ బాధ్యతను తీసుకున్న మూసీనది అభివృద్ధి సంస్థ ఘోరంగా విఫలమైంది. ఇదేంటని అడిగితే.. సిబ్బంది చేసే పనిని డ్రోన్లతో చేయిస్తున్నామని బల్దియా చెబుతోంది. డ్రోన్లు పిచికారి చేసే మందుతో ఎలాంటి ఉపయోగం కలగట్లేదని స్థానికులు చెబుతున్నారు. ‘‘మందు గుర్రపుడెక్క పై భాగంలో పడుతుంది. నీటిలోకి చేరట్లేదు. దాని వల్ల గుర్రపుడెక్క మాటున దోమ లార్వా జోరుగా వృద్ధిచెందుతోంది.’’అని సిబ్బంది వాపోతున్నారు. గుర్రపుడెక్కను తొలగించి, నీటిపై మందు చల్లినప్పుడే లార్వా చనిపోతుందని, దానికి విరుద్ధంగా పని జరుగుతోందని గుర్తుచేస్తున్నారు. దీనిపై మూసీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒక్కో చెరువుకు రూ.కోటి
మూడేళ్లపాటు చెరువులో గుర్రపుడెక్క తొలగింపునకు జీహెచ్‌ఎంసీ ఒక్కో చెరువుకు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. విస్తీర్ణం తక్కువగా ఉంటే రూ.70లక్షల వరకు వెచ్చిస్తోంది. అలా నగరవ్యాప్తంగా ఉన్న సుమారు 50 చెరువుల నిర్వహణను బల్దియా గుత్తేదారులకు అప్పగించింది. ప్రారంభంలో గుత్తేదారులు ఉత్సాహంగా పనిచేశారు. అనంతరం అధికారులకు కమీషన్లు ఇస్తూ.. నిర్వహణను వదిలేశారన్న విమర్శలొస్తున్నాయి. ప్రైవేటు నిర్వహణలోని ప్రతి చెరువు గుర్రపుడెక్కతో నిండి ఉండటమే అందుకు నిదర్శనం. సఫిల్‌గూడ చెరువు నిండా గుర్రపుడెక్క ఉందని, అక్కడి నుంచి వచ్చే దోమలు తమకు నిద్ర రాకుండా చేస్తున్నాయని కాలనీవాసులు గగ్గోలు పెడుతునప్పటికీ.. యంత్రాంగం చెరువును బాగు చేయకపోవడం ప్రత్యక్ష ఉదాహరణ.
ఇదీ చూడండి: జ్వరాల బారిన హైదరాబాద్... నగరమా... దోమల వనమా?