Group1 Edit Option Extend: గ్రూప్-1 దరఖాస్తుల సవరణల గడువును రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో వారం పొడిగించింది. ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 19 నుంచి నేటి వరకు ఇచ్చిన గడువును మరోసారి పెంచింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం సుమారు 3 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే కొన్ని పొరపాట్లు చేశామని.. ఎడిట్ చేసే అవకాశం ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరారు. దీంతో టీఎస్పీఎస్సీ మరోసారి సవరణలకు అవకాశం కల్పించింది. దరఖాస్తులో మార్పులు చేసుకునే వివరాలకు ఆధారంగా తగిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. వర్షాలు, వరదల వల్ల ధ్రువపత్రాలు పొందలేకపోయామని.. మరింత సమయం ఇవ్వాలని పలువురు అభ్యర్థులు కోరడంతో గడువు పెంచినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐపీఎంలో 24 ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.
ఇవీ చదవండి: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదు: హైకోర్టు