రోడ్లపై అత్యవసరంగా రాకపోకలు సాగించే అంబులెన్స్ వాహనాలు సజావుగా వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూనే అత్యవసర సేవల్లో ఉన్న వాహనాలను నిలిపివేయవద్దని సిబ్బంది, అధికారులకు సూచించారు. రాచకొండ కమిషనరేట్‌లో ఇందుకోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ప్రధానంగా ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో పనిచేసే వారు రెండు షిఫ్టుల్లో పనిచేయాలని... ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. రామాంతాపూర్ ప్రాంతంలోని పోలీసు చెక్‌పోస్టు వద్ద సీపీ లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సీపీ తాగు నీరు, అల్పాహారం అందజేశారు.