హైదరాబాద్‌లో గంగపుత్రుల తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్‌రోడ్డులోని గంగామాత ఆలయం వరకు బోనాలతో ఊరేగింపు చేపట్టారు. అనంతరం పూజలు చేసి ట్యాంక్‌బండ్‌లో తెప్పోత్సవం నిర్వహించారు. వేడుకల్లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
గంగపుత్రులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెప్పోత్సవంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గంగపుత్రులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కులాలకు, అనుబంధాలకు తెలంగాణ పుట్టినిల్లని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పెద్ద ఎత్తున గంగమ్మ తల్లి పండుగ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ గుడిని పెద్దగా నిర్మించుకోవాలని దీనికి తాను సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. గంగపుత్రులు లేని చోటే ముదిరాజ్‌లు చేపలు పట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గంగపుత్రులకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉత్సవాల్లో పెద్ద ఎత్తున గంగపుత్రులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల ఆటలతో వేడుకలు కోలాహలంగా సాగాయి.
ఇవీ చూడండి : పాములు పట్టాలంటే... మొక్కలివ్వాల్సిందే!