Grand Nursery Mela 2023 Hyderabad : హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళా-2023 నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. పలు కంపెనీలు, అంకుర కేంద్రాలు, నర్సరీలు దాదాపు 150 వరకు స్టాళ్లను ఏర్పాటు చేయగా.. ఆదివారం పెద్దఎత్తున తరలివచ్చిన సందర్శకులతో నర్సరీ మేళా కిటకిటలాడింది. సెలవు దినంతో పాటు వర్షంతో వాతావరణం చల్లగా మారడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అరుదైన మొక్కల వద్ద సెల్ఫీలు దిగుతూ సంబురపడ్డారు. నచ్చిన మొక్కలు కొనుగోలు చేశారు. ఈ మేళాలో రూ.50 నుంచి మొదలుకొని.. రూ.3 లక్షల వరకు విలువ చేసే మొక్కలు, వృక్షాలు అందుబాటులో ఉండటం విశేషం.
Grand Nursery Mela 2023 : హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన గ్రాండ్ నర్సరీ మేళా
14th Grand Nursery Mela Hyderabad 2023 : నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో గత నెల 31న ప్రారంభమైన 14వ గ్రాండ్ నర్సరీ మేళా సందడిగా సాగుతోంది. తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో రేపటి (6 రోజులు) వరకు జరగనున్న అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన-2023ను వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంత్ కె జెండగే లాంఛనంగా ప్రారంభించారు. ఏయేటి కాయేడు ఈ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో ఈసారి కొత్తదనంతో ఈ ప్రదర్శన ముందుకొచ్చింది. పీపుల్స్ మైదానంలో 150కి పైగా స్టాళ్లు కొలువు తీరాయి. వీటిలో 100కు పైగా కేవలం తెలుగు రాష్ట్రాలు సహా రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పేరెన్నిక గన్న నర్సరీలు కళకళలాడుతున్నాయి. మిగతావన్నీ అందమైన కుండీలు, స్టాండ్లు, వర్మీకంపోస్టు, విత్తనాలు, పనిముట్లు, ఇతర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం స్టాళ్లు ఏర్పాటయ్యాయి.
Grand Nursery Mela 2023 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ఉద్యాన రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుకు యోగ్యమైన ఆపిల్, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, కర్జూరం పండ్ల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తున్నాయి. విప్లవాత్మక కొత్త ఒరవడికి అద్దం పట్టే రీతిలో జంట నగరవాసులు, ప్రత్యేకించి ప్రకృతి ప్రేమికుల డిమాండ్‌కు అనుగుణంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నర్సరీ సంస్థలు, విత్తన, ఇతర కంపెనీల స్టాళ్లు ఏర్పాటయ్యాయి.
Grand Nursery Fair: నేటి నుంచి ఐదు రోజుల పాటు గ్రాండ్ నర్సరీ మేళా..
ఈసారి అందమైన బొన్సాయ్ వృక్షాలు, మొక్కలు అలరిస్తున్నాయి. పర్యావరణహితం దృష్ట్యా మట్టితో తయారు చేసిన కుండీలు, తులసి కోట, వినాయకుడు, గౌతమ బుద్ధుడి ప్రతిమలు అబ్బురపరుస్తున్నాయి. ఔషద మొక్క తులసి ఇంట్లో ఉంటే లక్ష్మి, ఆరోగ్యం సొంతం అన్న విశ్వాసం దృష్ట్యా వివిధ రకాలు అందుబాటులో ఉంచారు. కొవిడ్ నేపథ్యంలో సుగంధ, ఔషధ మొక్కల ప్రాధాన్యత తెలుసుకున్న క్రమంలో ఆయా జాతులు, రకాలు అందుబాటులోకి తీసుకొచ్చి స్టాళ్ల నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తులిప్, అమర్ లిల్లీ, జింజర లిల్లీ, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ వంటి కట్ ఫ్లవర్ ప్లాంటింగ్ మెటిరీయల్స్, కొత్తగా మనీ ప్లాంట్ ఐదారు రకాలు కళకళలాడుతున్నాయి. ప్రత్యేకించి బెంగళూరు గులాబీ, డచ్ గులాబీ, హాలండ్ గులాబీ, ఎడీనియం, జామియా సైకస్, బేబీ డాల్, అంతేరియం, అండ్రేంజా ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్స్ ప్రదర్శన, విక్రయాలు సాగుతున్నాయి.
టెర్రస్ గార్డెనింగ్, హోం గార్డెనింగ్‌లో రసాయనాలకు ప్రత్యామ్నాయంగా ఘన జీవామృతం, స్వచ్ఛమైన ఆవు పేడ, ఆవు మూత్రం, మిశ్రమంతో తయారు చేసిన ఘన జీవామృతం విక్రయిస్తున్నారు. ప్రకృతిలో లభ్యమయ్యే అరుదైన మొక్కలు.. ప్రత్యేకించి ఏకబిల్వం, మహాబిల్వం, రుద్రాక్ష, కృష్ణమర్రి రకాల ప్రదర్శన, విక్రయం విశేషంగా ఆకట్టుకుంటుంది. నగరీకరణ నేపథ్యంలో కొత్త కొత్త ఇళ్ల నిర్మాణం, ఆ తర్వాత అందంగా అలంకరించుకుని ప్రకృతిమయం, చల్లదనం కోసం దోహదం చేసే ల్యాండ్ స్కేప్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇండోర్, అవుట్‌డోర్ ప్లాంట్స్, లాన్ గ్రాస్, సాయిల్ బూస్టర్ ప్రత్యేకత సంతరించున్నాయి.
పీపుల్స్ ప్లాజా వేదికగా గ్రాండ్ నర్సరీ మేళా!
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి నీటి చుక్క వినియోగించుకోడానికి హైడ్రోపొనిక్ టెక్నాలజీ, సూక్ష్మ సేద్యం టెక్నాలజీ సంస్థలు తమ స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రకృతి, సేంద్రీయ విధానంలో పండించిన బియ్యం, పప్పులు, గానుగ నూనెలు, పసుపు, చిరుధాన్యాలు, ఇతర సుగంధ ద్రవ్యాలకు గిరాకీ పెరిగింది. గతంతో పోల్చితే ఈసారి నర్సరీ మేళాకు అద్భుతమైన స్పందన లభిస్తోందని నిర్వాహకులు చెప్పారు. ఈ నర్సరీ మేళాకు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, టెర్రస్ గార్డెన్ నిర్వాహకులకు ఉచిత ప్రవేశం కల్పించినట్లు తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ వర్గాలు తెలిపాయి.