రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ వ్యర్థం, కరోనా కేసుల పెరుగుదలపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. టీకా వృథా గురించి, పాఠశాలలు, హాస్టళ్లలో కొవిడ్ కేసుల సంఖ్యపెరగడం, వ్యాప్తి జరగకుండా తీసుకున్న చర్యలపై ఆరోగ్య శాఖ నుంచి నివేదిక తెప్పించాలని రాజ్‌భవన్ అధికారులను గవర్నర్ ఆదేశించారు.
రెండు గురుకుల పాఠశాలల్లో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీకా వృథా అధికంగా ఉండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. అర్హత ఉన్న వారందరికీ టీకాలు వేయడం అవసరమని గుర్తు చేసిన తమిళిసై.. అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. గిరిజన నివాసాల్లో పోషక జోక్యాన్ని ప్రస్తావించిన గవర్నర్... రిసోర్స్ వ్యక్తుల కోసం శిక్షణా కార్యక్రమాన్ని ఏప్రిల్ తొలి వారంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.