కరోనా పరిణామాల నేపథ్యంలో గిరిజనులకు పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాపంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ హైదరాబాద్‌లోని రాజ్ భవన్ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
గిరిజనుల పౌష్టికాహార స్థితిగతులను అధ్యయనం చేయాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు. వారిని సమీక్షించేందుకు ఎన్ఐఎన్, ఇతర సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలన్న తమిళిసై... తద్వారా గిరిజనులకు అందించాల్సిన ఆహారానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించవచ్చని అభిప్రాయపడ్డారు. రెడ్ క్రాస్ సంస్థ వాలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వయం ఉపాధి శిక్షణ పొందుతున్న మహిళలతోనూ మాట్లాడిన గవర్నర్.. వారి ఉత్పత్తులను ప్రశంసించారు. వారికి ఆర్థికసాయం అందిస్తామన్న తమిళిసై.. మహిళా సాధికారతను ప్రోత్సహించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.