అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ పక్కన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి.సౌందర రాజన్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలో నర్సులు అసమానమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ అన్నారు. ఆరోగ్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆరోగ్య రంగంలో రోగుల సేవలో నర్సులు అద్వితీయమైనవిగా అభివర్ణించారు. నర్సుల సేవలకు గవర్నర్ సెల్యూట్ చేశారు.
తమ ఆరోగ్యాలు, జీవితాలను పణంగా పెట్టి ఈ కొవిడ్-19 నేపథ్యంలో సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా... ముఖ్యంగా భారత్‌లో నర్సులు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని అన్నారు. తాను చైన్నైలో మెడిసిన్ చదువుతున్నప్పుడు మెడికల్ కళాశాల, ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులతో అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. నర్సుల నైపుణ్యాలు, అంకితభావం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని వివరించారు. యువత ఆరోగ్య రంగంలో నిస్వార్థమైన సేవలు అందించాలంటే నర్సింగ్ వృత్తిని ఎంచుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆధునిక నర్సింగ్ వృత్తికి ఆధ్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు గవర్నర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని... ఆమె సేవలు స్ఫూర్తిదాయకమైనవని గవర్నర్ కొనియాడారు. అనంతరం... వర్చువల్ పద్ధతిలో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్... తమిళనాడులోని నర్సులకు వారి అత్యుత్తమ సేవలకుగానూ పురస్కారాలు అందజేశారు.