Tamilisai At Sankranti Celebrations : తెలంగాణ రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తమిళిసై పొంగలి అన్నం వండారు. మంచి పొంగల్, సంతోష పొంగల్, ఆరోగ్య పొంగల్, జీ20 పొంగల్ వండానని చెప్పారు. అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. మలక్పేట ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్దరు మహిళలు మరణించడం బాధాకరమని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసవాలు, సిజేరియన్ సేవలు ఓ ఆసుపత్రిలో ప్రాథమికం అన్న తమిళిసై... ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిని సందర్శించాలని తాను అనుకున్నానని, అయితే పండుగ కారణంగా వెళ్లడం లేదని చెప్పారు.
Tamilisai At Sankranti Celebrations in Rajbhavan : "గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారు. తెలంగాణలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మరింతగా మెరుగుపరచాలి. వైద్యరంగంలో మెరుగవ్వడం లేదని చెప్పడం లేదు, కానీ ఇంకా మెరుగు పరచాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. బిల్లులు పెండింగ్ కాదు, పరిశీలనలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వివాదాలతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన. ఈ తరహా విధానాల విషయంలో గతంలోనూ న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి." - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలును ఇవాళ ప్రధాని ప్రారంభించడం సంతోషకరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అందరూ టీవీలు చూస్తోంటే ప్రధాని మన్ కీ బాత్ ద్వారా రేడియోకు పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పారు. అదే తరహాలో విమానాలు కాకుండా రైళ్లపై ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారని తమిళిసై వెల్లడించారు.