Governor Tamilisai on Pending Bills తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ తెరాస ప్రభుత్వం అన్నట్టుగా కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ తమిళిసై.. బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రభుత్వం వద్ద నుంచి తన వద్దకు బిల్లులు వచ్చాయని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వ బిల్లుల విషయమై పరిశీలిస్తున్నామని తెలిపారు. వర్సిటీలో ఉమ్మడి నియామక బోర్డుపై ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. బిల్లుపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మరికొన్ని బిల్లులపై సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉందన్నారు. అన్ని బిల్లులపై సమగ్రంగా పరిశీలన కోసం సమయం తీసుకున్నానని వెల్లండించారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పానని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల వీసీలతోనూ మాట్లాడానని తెలిపారు. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించానని వివరించారు.
'నేను ఎలాంటి బిల్లులను ఆపలేదు. నేను బిల్లులను తొక్కి పెట్టాననడం సబబు కాదు. కొత్తగా నియామక బోర్డు ఎందుకని అడిగాను. బిల్లులను ఒకదాని వెంట ఒకటి పరిశీలిస్తున్నాను. నియామకాల బిల్లుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను. కొత్త విధానం అవసరమా? కాదా? అని పరిశీలిస్తున్నా... నేను అడ్డుకున్నానని అనడం సబబు కాదు. బోధనా పోస్టులను భర్తీ చేయాలని మొదట్నుంచీ చెబుతున్నా.. వీసీలకు ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశాను.' - గవర్నర్ తమిళిసై
Governor Tamilisai on TS GOVT ఖాళీల విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చానని తెలిపారు. పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని పదేపదే డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. వీసీ పోస్టులు కూడా చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. తాను పదేపదే డిమాండ్ చేశాక వీసీలను నియమించారని మండిపడ్డారు. కొత్త విధానంపై నాకు సందేహాలు ఉన్నాయన్నారు. న్యాయపరంగా చెల్లుబాటు అవుతుందా? అని ప్రశ్నించారు. కేంద్రీకృత విధానంతో ఇబ్బందులు రావా? అన్నారు. నియామకాలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. అర్హులకు మాత్రమే పోస్టులు దక్కాలన్నారు.
''నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యకరం. సీఎంవో నుంచి మంత్రికి లేఖ రావడానికి జాప్యమైతే సమస్యలు ప్రగతిభవన్‌కు ఎలా చేరుతాయి? నాకు ఎలాంటి భేషజాలు లేవు. నా పర్యటనల గురించి ప్రభుత్వానికి సమాధానం ఇస్తున్నా. ప్రొటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. రాజ్‌భవన్ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తున్నారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తారని విద్యార్థుల ఐకాస పేరిట వార్తలు వస్తున్నాయి. రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి. బాసర విద్యార్థులు వచ్చారు.. మిగతా విద్యార్థులు వచ్చారు. రాజ్‌భవన్ తలుపులు తెరుచుకుని ఉంటాయి, ప్రగతిభవన్ మాదిరి కాదు.'' - గవర్నర్ తమిళిసై
ఇవీ చూడండి: