Governor approves currency bill: ద్రవ్యవినిమయ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేశారు. ఈ నెల మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీలో చివరి రోజు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ చేశారు. 2023 - 24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించిన రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించారు. గవర్నర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రెండు బిల్లులు చట్టరూపం దాల్చాయి.
రెండు చట్టాలను గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికకు సంబంధించిన ద్రవ్యవినిమయ బిల్లులను శాసనసభ ఈ నెల 12వ తేదీన ఆమోదించింది. వాటిని ఇవాళ రాజ్ భవన్‌కు పంపారు. గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేయడంతో ద్రవ్యవినిమయ బిల్లులు చట్టరూపం దాల్చాయి.
బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున తెలంగాణ శాసనసభ రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాల్లో సమాధానం ఇచ్చారు. రెండున్నర గంటల పాటు కేసీఆర్ ప్రసంగించారు. మండలిలో చర్చకు మంత్రి హరీశ్‌రావు కూడా జవాబు చెప్పారు. అనంతరం ఈ బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ద్రవ్యవినిమయ బిల్లులో రాష్ట్రానికి ఒక వార్షిక సంవత్సరంలో అవసరమైన బడ్జెట్‌ను వివిధ వ్యక్తులు, మంత్రులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తరవాత అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. ఈ బిల్లును ప్రతి సంవత్సరం ప్రవేశపెడతారు. ఈ బిల్లు ప్రవేశపెట్టిన తరవాత ఇరు సభల్లో చర్చ జరుపుతారు. బిల్లు ఎంతవరకు సాధించగలం, ఎలా ఉపయోగపడుతుంది.. తదితర అంశాలు దృష్టిలో పెట్టుకుని చర్చిస్తారు. ఏవైనా లోటు పాటులు ఉంటే సరిదిద్దుతారు. అవి సరి చేసిన తరవాత రెండు సభల్లో ఆమోదం పొందుతుంది. ఆపై గవర్నర్ ఆమోదం చెందాక బిల్లు చట్టంగా మారుతుంది.
ఇవీ చదవండి: