Governor tamilisai comments on telangana govt తెలంగాణలో రాష్ట్రప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడించారు.
ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని కొంతమంది యత్నించారని ఆరోపించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చిందని తెలిపారు. గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని 2 నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశానని ఈ సందర్భంగా తెలిపారు. రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలని 2 రోజుల క్రితమే ప్రభుత్వం తెలిపినట్లు చెప్పారు.
కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదని మండిపడ్డారు. గణతంత్ర వేడుకల సందర్భంగా కొందరిని సన్మానించామన్నారు. గణతంత్ర వేడుకలు ప్రజల మధ్య జరుపుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని వివరించారు.
ప్రజల మధ్య రిపబ్లిక్ వేడుకలు జరపడం సంతోషంగా ఉంది. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారు. రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని కొంతమంది యత్నించారు. గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని 2 నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశా. ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో.. ఈ అవకాశం వచ్చింది. - గవర్నర్ తమిళిసై
ఇక కరోనా తర్వాత మొదటిసారిగా రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పరేడ్ గ్రౌండ్‌లో అమర జవాన్ల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం.. గవర్నర్ రాజ్‌భవన్‌లో నిర్వహించిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళిసై.. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని పేర్కొన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న ఆమె.. కేసీఆర్ సర్కారు తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: