మహిళల అక్రమరవాణా, బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలందిస్తోన్న వారిని గవర్నర్ దృశ్య మాధ్యమం ద్వారా సన్మానించారు.
మెగసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా, తరుణి సంస్థ మమతా రఘువీర్, ప్రజ్వలా ఫౌండేషన్ సునితా కృష్ణన్, గాంధీ ఆసుపత్రి వైద్యురాలు అనిత, రవి హీలియోస్ ఆసుపత్రి డాక్టర్ విజయ్ కుమార్ గౌడ్ సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు.
కష్టనష్టాలకు ఓర్చి ఎంతో ధైర్యంతో సేవ చేస్తున్నారని తమిళిసై ప్రశంసించారు. పేదలు, కష్టాల్లో ఉన్న వారికి నిస్వార్థంగా సేవచేయడం దైవకార్యమని, నిస్వార్థ సేవ కోసం జీవితాన్ని అంకితం చేసే వారు చాలా గొప్పవారని కొనియాడారు. ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి సేవలు అందించేందుకు ఎంతో ధైర్యం, సానుకూల ధృక్ఫథం కావాలని అన్నారు. తాను వైద్యవిద్యలో పీజీ చదువుతున్న సమయంలో చాలా మంది పేదవారు వైద్యం కోసం ఎడ్లబండ్లపై వచ్చేవారని... దాంతో ఆలస్యమై సకాలంలో చికిత్స అందుకోలేకపోయే వారని గుర్తు చేసుకున్నారు. అదే కెనడాలో చదువుతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్న చిన్నారులను హెలికాప్టర్లలో ఆసుపత్రులకు తీసుకొచ్చేవారని అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చి పేదలకు సేవ చేసేందుకు ఈ ఉదంతాలు దోహదపడ్డాయని తమిళిసై అన్నారు. మహిళలు, చిన్నారులపై ఇంకా అక్కడక్కడా ఆఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్... పేదరికమే చాలా ప్రధాన కారణమని పేర్కొన్నారు. పేదరికం, నిరుద్యోగం, వెనకబాటుదనం, దోపిడీ నిర్మూలన కోసం అందరమూ ప్రయత్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళల అక్రమరవాణా, బాలకార్మికవ్యవస్థ, బాల్యవివాహాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఫలితాలు వచ్చే దిశగా ప్రయత్నిస్తానని గవర్నర్ చెప్పారు. సేవా వ్యక్తిత్వం కలిగిన ప్రధాని మోదీని దేశసేవలో అందరూ అనుకరించాలని సూచించారు.
ఇదీ చదవండి: 'అమూల్ బేబీ' ఎలా పుట్టిందో తెలుసా?